మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తోన్న వీరాంజనేయ జలాశయ నిర్వాసిత గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాస ప్యాకేజీని ప్రకటించింది. సిద్దిపేట, సిరిసిల్ల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో నిర్వాసితులకు ఇస్తున్న తరహాలోనే బండ రావిపాకుల, కొంకలపల్లి గ్రామాలకు పునరావాసం కల్పించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇంటి స్థలంతోపాటు
ఒక్కో నిర్వాసిత కుటుంబానికి 250 గజాల ఇంటి స్థలంతోపాటు రెండు పడకగదుల ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు, పునరావాసం కోసం మరో ఏడున్నర లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. 18 ఏళ్లు పైబడిన వారికి ఇంటిస్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. బండరావిపాకులలో 729 నిర్వాసిత కుటుంబాలకు, 249 మంది మేజర్లకు, కొంకలపల్లిలో 269 నిర్వాసిత కుటుంబాలకు, 52 మంది మేజర్లకు ఆ పరిహారం అందనుంది. అందుకోసం 140 కోట్ల 19 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.