తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు సర్కారు సన్నద్ధం.. నిల్వ చేసే అంశమే ప్రశ్నార్థకం..!

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పండిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటామని చెబుతున్నప్పటికీ... ఎక్కడ నిల్వ చేయాలన్న అంశమే ప్రశ్నార్థకంగా మారింది. యాసంగిలో కొన్న ధాన్యమే ఇప్పటికీ రైస్ మిల్లులు, గోదాంలు, రైతువేదికల్లో మూలుగుతోంది. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణలో అధికారులకు తిప్పలు తప్పేలా లేవు.

By

Published : Oct 22, 2021, 4:47 AM IST

government ready for paddy procurement but no place to Reserve in mahaboobanagar
government ready for paddy procurement but no place to Reserve in mahaboobanagar

ఖరీఫ్‌లో పండిన ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. ఈ సారి ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ఇబ్బందులు తప్పేలా లేవు. యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యమే ఇప్పటికీ రైస్ మిల్లుల్లో లక్షల మెట్రిక్ టన్నుల్లో పేరుకుపోయి ఉంది. ఆ నిల్వల్ని మరాడించి కస్టమ్ మిల్లింగ్ కింద మిల్లర్లు ఎఫ్​సీఐ(FCI) కి అప్పగించాల్సి ఉండగా... ఇప్పటికీ 30శాతం కూడా ఇవ్వలేకపోయారు. గత సీజన్‌లో అన్ని జిల్లాల్లో మిల్లింగ్ సామర్థ్యానికి రెట్టింపు ధాన్యం అప్పగించారు. మిల్లు సామర్థ్యం ఎంతో అంతే ఇస్తే నవంబర్ నాటికి కస్టమ్ మిల్లింగ్ పూర్తయ్యేది. సామర్థ్యానికి మించి రావడంతో 70శాతం ధాన్యం ఇంకా మిగిలిపోయి ఉంది. దీనికితోడు సీఎంఆర్​(CMR) బియ్యాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్​సీఐ(FCI) గోదాముల్లో నింపి, అక్కన్నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తే సమస్య ఉండేది కాదు. కానీ మిల్లర్ల నుంచి బియ్యం తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా మిల్లుల్లో ధాన్యం ఖాళీ కావడం లేదు.

ఎక్కడ నిల్వ చేస్తారో..

యాసంగిలో మిల్లుల సామర్థ్యం సరిపోక పాఠశాలలు, కళాశాలలు, ఫంక్షన్ హాళ్లు, రైతు వేదికల్లో ధాన్యం నిల్వచేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని చాలా రైతు వేదికల్లో ఇప్పటికీ ధాన్యం అలాగే నిల్వ ఉంది. సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్​సీఐ(FCI) ఎప్పటికప్పుడు సేకరిస్తే ఈ సమస్య ఉండేది కాదని మిల్లర్లు చెబుతున్నారు. గోదాముల సామర్థ్యం పెంచుకోవాలని సూచించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఉన్న ధాన్యామే ఖాళీకాక ఇబ్బందులు పడుతుంటే వానాకాలంలో సేకరించే ధాన్యాన్ని ఎక్కడ నిల్వచేయాలని ప్రశ్నిస్తున్నారు.

ఇబ్బందులు తప్పేలా లేవు..

ఈసారి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు 18 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా. మార్కెట్ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, ఇతరాలు పోను సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని పౌర సరఫరాలశాఖ కార్పొరేషన్ భావిస్తోంది. ప్రస్తుతం మిల్లుల సామర్థ్యం పోను ప్రతి జిల్లా నుంచి లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇతర జిల్లాలకు కేటాయించాల్సి ఉంటుంది. కానీ అన్ని జిల్లాల్లో వరి విస్తీర్ణం, దిగుబడులు గణనీయంగా పెరిగినందున ఇతర జిల్లాల్లోని మిల్లులు సైతం ధాన్యాన్ని తీసుకునేందుకు సిద్ధంగా లేవు. అలాగైతే సేకరించిన ధాన్యం నిల్వ చేసేందుకు ఇబ్బందులు తప్పేలాలేవు.

యాసంగిలోలాగా ధాన్యం నిల్వ చేసేందుకు ఇబ్బందులు పడకుండా... ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details