రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్-19 వ్యాప్తిని నిరోధించడంలో పూర్తిగా విఫలమైందని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో పాటు నిబంధనలు పాటించకుండా సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతిచ్చి తప్పు చేసిందన్నారు.
ప్రజా ప్రతినిధులకు సోకగానే సత్వర స్పందన..
కరోనా కేసులకు చికిత్సలు అందించే వైద్యులకు, సిబ్బందికి కరోనా సోకితే స్పందించని ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజా ప్రతినిధులకు వస్తే ప్రైవేట్‌లో పరీక్షలు చేసేందుకు నిర్ణయించారని మండిపడ్డారు. ఇప్పటి వరకు కేవలం 32 వేల పరీక్షలే నిర్వహించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలకు సోకిందనే కేసీఆర్ స్పందించింది : కొత్తకోట కేవలం గ్రేటర్ వరకే పరీక్షలా ?
కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే కరోనా పరీక్షలు చేయాలనే నిర్ణయం సరైంది కాదన్నారు. జిల్లాలోనూ కొవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. డిజాస్టర్ మెనేజ్‌మెంట్ యాక్ట్ కింద వచ్చిన నిధులతో పాటు సీఎం సహాయ నిధికి వెల్లువెత్తిన విరాళాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు.
నికర జలాలు సహా వరద నీటిని ఒడిసిపట్టాలి !
కృష్ణా జలాల్లో తెలంగాణకు 37 టీఎంసీల నికర జలాలతో పాటు 40 టీఎంసీల వరదనీటిని ఒడిసి పట్టేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వాటిని ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అందులో భాగంగానే జీవో నం.69ని అమలు చేయడం సహా జూరాలను రీ డిజైన్ చేయాలన్నారు. ఫలితంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సైతం నీటిని తరలించొచ్చని వివరించారు.
ఇవీ చూడండి : ఇంధన ధరల పెంపుపై వెనక్కి తగ్గండి: సోనియా