తెలంగాణ

telangana

By

Published : Dec 26, 2019, 3:23 PM IST

ETV Bharat / state

ప్లాస్టిక్​ నుంచి పేపర్ సంచికి మారుదాం...

ప్లాస్టిక్​.. ప్లాస్టిక్​.. ప్లాస్టిక్​..  ఎక్కడా చూసినా ఇప్పుడు ఇదే అంశం ట్రెండింగ్​ అవుతోంది. కానీ అందుకు అనుగుణంగా ప్రజల తమ అవసరాలకు ప్లాస్టిక్​ను వాడటం మాత్రం మానడం లేదు.  ముందుగా ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలి సరే.. మరీ ప్రత్యామ్నాయం కూడా అందుబాటులో ఉండాలి కదా. అప్పుడే నిషేధం పూర్తిగా అమలయ్యే అవకాశం ఉంటుంది. సరిగ్గా అదే ఆలోచనతో ప్లాస్టిక్​కు బదులుగా కాగితపు, వస్త్రపు సంచుల తయారీలో మహిళలకు శిక్షణ ఇచ్చింది మహబూబ్​నగర్ డీఆర్​డీఏ.

From plastic to paper bags in telangana
ప్లాస్టిక్​ నుంచి పేపర్ సంచికి మారుదాం...

ప్రస్తుతం పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్​ను వినియోగించకూడదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్లాస్టిక్ స్థానంలో కాగితపు, వస్త్రపు సంచులు అందుబాటులోకి తేవాలని భావించింది మహబూబ్​నగర్ గ్రామీణాభివృద్ధి సంస్థ. ఈ మేరకు కాగితపు, వస్త్రపు సంచుల ఉత్పత్తుల తయారీపై సుమారు 160 మంది మహిళా సంఘ సభ్యులకు నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. వారిలో ఉత్సాహవంతులైన మహిళలు కాగితపు, వస్త్రపు సంచుల తయారీకి ముందుకొచ్చారు. కూరగాయలు, దుస్తులు, పుస్తకాలు, లంచ్ బాక్సులు, సరుకులు తీసుకువెళ్లేందుకు వీలుగా సంచులను తయారు చేస్తున్నారు. వారు తయారు చేసిన ఉత్పత్తులను మహబూబ్​నగర్ పట్టణం సహా గ్రామాల్లో అమ్ముతున్నారు.

మహిళలు బృందంగా ఏర్పడి
ఒక్కో మహిళా సంఘం నుంచి నలుగురైదుగురు మహిళలు బృందంగా ఏర్పడి కాగితపు, వస్త్రపు సంచులు, ఇతర ఉత్పత్తులను సొంతంగా తయారు చేస్తున్నారు. అవసరమైన ముడిసరుకును సొంత పెట్టుబడితో హైదరాబాద్ నుంచి తెచ్చుకుని అందమైన సంచులను తయారు చేస్తున్నారు. అన్ని రకాలు సైజుల్లో 5 రూపాయల నుంచి 30 రూపాయల వరకూ ఈ సంచులు లభిస్తాయి. కాగితపు పూల బొకెలు, వస్త్రాలతో చేసిన టోపీలు, ఇతర ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఒక్కో సంచికి శ్రమను బట్టి రూపాయి నుంచి 5 రూపాయల వరకూ మాత్రమే లాభం చూసుకుని విక్రయిస్తున్నారు. వ్యాపార సముదాయాలు, దుకాణాల నుంచి సైతం ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు.

ప్లాస్టిక్ నిషేధం పూర్తిగా అమలుకాకపోవడం వల్ల ఈ ఉత్పత్తులపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ప్లాస్టిక్ సంచులతో పోల్చితే కాగితపు, వస్త్ర సంచుల ధర ఎక్కువ. పలువురు వినియోగదారులు వీటిని కొనేందుకు ముందుకు రావడం లేదు. వినియోగం బాగా పెరిగి ఆర్డర్లు పెరిగితే ఉత్పత్తి ఖర్చు తగ్గి, వస్తువు ధరలు దిగొచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ప్లాస్టిక్​ నుంచి పేపర్ సంచికి మారుదాం...

ఇదీ చూడండి : ప్లాస్టిక్​ నుంచి పెట్రోల్​ తీస్తున్న ఔత్సాహికవేత్త..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details