Fraudsters Collects Nude Photos from Women: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జోగులాంబ గద్వాల జిల్లాలో నగ్నవీడియో కాల్స్ వ్యవహారం మరవకముందే.. మరో కొత్త తరహా మోసం మహబూబ్నగర్లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. ఇప్పటి వరకు 'ఈ-మెయిల్', మెసేజ్ల ద్వారా బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నారు. మొన్నటి వరకు నగ్న వీడియో కాల్స్, ఛాటింగ్లతో రెచ్చిపోయిన మోసగాళ్లు తాజాగా మరో నయా దందాకు తెరలేపారు.
పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు/యువతులను లక్ష్యంగా చేసుకొని మోసగాళ్లు ఈ దందాకు పాల్పడ్డారు. ఇంతకీ ఆ కొత్త దందా ఏమిటంటే ముందుగా తాము ఎంచుకున్న మహిళతో మాయమాటలు కలుపుతారు. ఎదో రకంగా ఆమెను ఒప్పుకునేలా కళ్లబొల్లి మాటలు చెప్పి నగ్న చిత్రాలు సేకరిస్తారు. ఆ నగ్న ఫొటోలు హైదరాబాద్లోని తమ గురువుకి పంపితే డబ్బులు వస్తాయంటూ నమ్మబలుకుతారు. ఆ తర్వాత ఎవరికి దొరకకుండా మాయమైపోతున్నారు. కొద్దిరోజుల క్రితం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన వ్యవహారంతో ఈ నయా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ నగ్న ఫొటోల వ్యవహారం ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతోంది.