Trees Translocated in Mahabubnagar: సాధారణంగా మొక్కలను నాటుతుంటాం. ఇళ్లలో, రహదారుల వెంట, ఖాళీ స్థలాల్లో, అడవుల్లో వాటిని నాటడం ఆనవాయితీ. కాని.. 150 ఏళ్ల వయస్సు కలిగిన భారీ వృక్షాలను నాటడం విశేషం. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల అతిథి గృహం ఆవరనలో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను వాటి కొమ్మలను నరికి మొదలు,కాండం, వేర్లతో వాటిని భూమిలో నుంచి వెలికి తీసి తిరిగి వాటిని జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న మయూరి అర్బన్ ఎకో పార్క్ ఆవరణలో నాటారు. అతిథి గృహం స్థలంలో కూరగాయలు, మాంసం, ఇతర అవసరాల కోసం అధునాతన మార్కెట్‌ను నిర్మిస్తున్నారు.
ప్రాణం నిలిపేలా: ఈ మేరకు అక్కడ భవనాలను నిర్మించడానికి అనువైన ప్రదేశం ఉన్నా... అందులో 150 ఏళ్ల వయస్సు పైబడిన 5 పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. భవన నిర్మాణానికి అవి అడ్డు వస్తున్నాయి. భారీ చెట్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా భవనాన్ని నిర్మించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోషకుమార్‌కు సమాచారం చేరగా.. చెట్లను మరో ప్రాంతంలో నాటే విధంగా చర్యలు చేపట్టాలని వట ఫౌండేషన్’ ప్రతినిధులకు సూచించారు. దీంతో భారీ లారీలు, పెద్ద క్రేన్ సహాయంతో ఒక్క రోజులోనే వాటిని తొలగించి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ ఆవరణలో నాటారు. పెద్ద వృక్షాలను తిరిగి నాటడానికి మూడు రోజుల ముందుగానే ఏర్పాట్లు చేశారు. చెట్లను తిరిగి నాటిన తర్వాత అవి పునర్జీవం పొందేవిధంగా అవసరమైన రసాయనక చర్యలు చేపట్టారు. తిరిగి నాటిన ఈ చెట్లకు 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో చిగుళ్లు వస్తాయి. 5 ఏళ్లలో అవి సాధారణ చెట్లుగా మారతాయి.
వట ఫౌండేషన్ సహకారం:చెట్లకు ప్రాణప్రతిష్ఠ చేసే మహాయాగాన్ని తలకెత్తుకున్న వట ఫౌండేషన్ 2010లో ఏర్పాటైంది. ముగ్గురు మిత్రులు కలిసి స్థాపించిన ఈ సంస్థలో స్వచ్ఛందంగా వంద మందికి పైగా పని చేస్తున్నారు. సాధరణంగా రావి, మర్రిచెట్ల వంటి వాటిని మాత్రమే తిరిగి నాటేందుకు అవకాశం ఉన్నా... "వట ఫౌండేషన్" మాత్రం తొలగించాల్సి వచ్చిన ప్రతీ చెట్టును తరలించి పునర్జీవం పోసేందుకు చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ నిర్మాణాలైనటువంటి రహదారుల విస్తరణ, ప్లై ఓవర్‌ల నిర్మాణంలో అడ్డుగా వచ్చిన చెట్లను ఇదే తరహాలో నాటుతున్నట్లు తెలిపారు. చెట్లు వంద శాతం బతకాలంటే.. వర్షాకాలంలో ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉండేదన్నారు. కాని, అత్యవసరం కావడంతో... చెట్లను బతికించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వాటిని తరలించిన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో త్వరగా పెరిగే చెట్లను మాత్రమే నాటుతున్నారని.. ఇలాంటి చెట్లు పెరగాలంటే 50 ఏళ్లు పడుతుందన్నారు. మానవాళికి అవసరమయ్యే ఈ భారీ చెట్లను తొలగించకపోవటమే సబబని.. కానీ, తప్పని పరిస్థితుల్లో వాటిని తొలగించాల్సి వచ్చినప్పుడు తిరిగి నాటడం ఎంతో మేలన్నారు. ఒక భారీ చెట్టు... వెయ్యి చిన్న చెట్లతో సమానమని.. దీనికే పునర్జీవం పోస్తే 5 ఏళ్లలో తిరిగి యథాస్థితికి చేరుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2వేల 500 వృక్షాలను ఒక ప్రాంతం నుంచి తీసి మరోక ప్రాంతంలో నాటినట్లు వారు తెలిపారు.