Fraudsters Cheat with Nude Photos: మహబూబ్నగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారిన మహిళల నగ్న ఫొటోల వ్యవహారంలో పోలీసులు ముందడుగు వేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. నలుగురి నిందితులను విచారించగా కొన్ని విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ప్రధాన నిందితుడు దొరికితే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.
పూజకు ఎంపికైతే కోట్లు వచ్చిపడతాయి. కానీ ఆ పూజకు ఎంపిక కావాలంటే శరీరాకృతి చూపే నగ్నఫొటోలు అవసరమని చెప్పారు. అలా మాయ మాటలు చెప్పి 20 నుంచి 25 మంది అమాయక మహిళల ఫొటోలు సేకరించిన ముఠాను మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. అతని కోసం గాలింపు చేపడుతున్నామన్నారు. ఈ నెల 18న జడ్చర్ల పట్టణం పాతబజారులో గొడవ జరుగుతుందని డయల్-100కు ఫోన్ వచ్చింది. అక్కడకు చేరుకున్న పోలీసులు ఓ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొదట జైనుల్లావుద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మహిళ ఫొటోలు తీశారన్న ఆరోపణపై అతన్ని విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.