తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఫార్మా పరిశ్రమల' పాపం.. మత్స్యకార కుటుంబాల పాలిట శాపం - Mahbubnagar District News

pharma pollution in Mahabubnagar: ఫార్మా కంపెనీల నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థాలు చెరువులో చేపల పాలిట శాపంగా మారాయి. ప్రభుత్వం పంపిణీ చేసిన సబ్సిడీ చేప పిల్లలు, ప్రైవేటుగా కొనుగోలు చేసి చెరువులో వేసిన చేపలు మృత్యువాత పడుతున్నాయి. కలెక్టర్ సహా, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు మత్స్యకారులు చేస్తున్న ఫిర్యాదులు బుట్ట దాఖలవుతున్నాయి.

చేపల మృతి
చేపల మృతి

By

Published : Mar 7, 2023, 1:48 PM IST

pharma pollution in Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి పల్లె చెరువులో నిత్యం చేపలు చనిపోతున్నాయి. సమీపంలోని ఫార్మా కంపెనీల నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థాల కారణంగానే చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఏటా ప్రభుత్వం వంద శాతం రాయితీతో పంపిణీ చేసే చేప పిల్లలను ఈ చెరువులో పెంచుకుంటారు. మరికొంతమంది సొంతంగా కొనుగోలు చేసిన చేప పిల్లలనూ ఈ చెరువులో వదిలిపెడతారు.

అలా ఈ చెరువుపై ఆధారపడి దాదాపు 100 కుటుంబాలు జీవిస్తున్నాయి. కానీ గడిచిన కొన్నేళ్లుగా.. ఈ మత్స్యకారుల జీవనోపాధికి గండి పడుతోంది. గతంలో పిల్లలు వేసిన 3 నెలల తర్వాత ఒక్కో చేప కిలో నుంచి అంతకన్నా ఎక్కువ బరువు తూగేవి. ప్రస్తుతం 3 నెలలు గడుస్తున్నా అర కిలో కూడా తూగడం లేదని మత్సకారులు వాపోతున్నారు. పారిశ్రామిక కాలుష్యం కారణంగా మత్స్యకారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థ జలాల కారణంగా చేపలతో పాటు చెరువులోని నీరు, మట్టి సైతం పనికి రాకుండా పోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. పక్కన భూముల్లో రైతులు వేసిన పంటలు సైతం పండటం లేదని రైతులంటున్నారు. కాలుష్యంపై జిల్లా కలెక్టర్‌కు, కాలుష్య నియంత్రణ మండలికి, ప్రభుత్వ కార్యదర్శికి ఫిర్యాదులు చేసినా.. నమూనాలు సేకరించి, నివేదికలు సమర్పించడం తప్ప అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

చెరువులో చేపలు మృతి చెందడానికి.. పరిశ్రమల కాలుష్యం ఒక కారణం కాగా.. వేసవిలో ఆక్సిజన్‌ తగ్గడం కూడా మరో ప్రభావం కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు మత్సశాఖ అధికారులు కలెక్టర్​కు నివేదిక సమర్పించారు. కారణం ఏదైనప్పటికీ.. ముదిరెడ్డిపల్లి చెరువులో నిత్యం చేపల మృత్యువాతకు కారణం ఏంటనే అంశంపై పరిశీలన జరపాలని, తమ బతుకుదెరువును కాపాడాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు.

"గత ఏడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది. ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలతో చేపలలో పెరుగుదల సరిగా లేదు. ఫార్మా కంపెనీలు ఎగువ ప్రాంతంలో ఉన్నాయి. చెరువు దిగువ ప్రాంతంలో ఉంది. ప్రభుత్వం సరఫరా చేసే చేప పిల్లలతో పాటు బయట నుంచి చేప పిల్లలను కొని ఈ చెరువులో పెంచుతున్నాము. మూడు నెలలు నిండినా చేపల బరువు పెరగడం లేదు. మేము తీవ్రంగా సష్టపోతున్నాం". -ఆంజనేయులు, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు, ముదిరెడ్డిపల్లి

"ఫార్మా కంపెనీ నుంచి వ్యర్థ జలాలను సాధారణ సమయంలో బయటకు వదలరు. వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు వదులుతారు. దాంతో ఆ కాలుష్య జలాలన్నీ చెరువులో కలుస్తున్నాయి. దీంతో చెరువు మట్టి, భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడుతున్నాయి. పంటలు ఆశించిన స్థాయిలో పండటం లేదు. ఈ విషయమై కలెక్టర్‌కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు". -కోస్గి వెంకటయ్య, మత్స్య సహకార సంఘం సభ్యుడు, ముదిరెడ్డిపల్లి

ఫార్మా వ్యర్థాలతో చేపల మృతి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details