తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫాస్టాగ్ ఉన్నా వడ్డింపులు... రీఛార్జ్ కాక వాహనదారుల అవస్థలు - toll plaza problems news

జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ లేని వాహనదారులు రెట్టింపు రుసుము చెల్లించాలన్నది నిబంధన. వాస్తవానికి ఫాస్టాగ్ ఉన్నా... కొంతమంది వాహన యజమానులకు వడ్డింపులు తప్పడం లేదు. కొందరికి ఖాతాలు ఉన్నా రీఛార్జ్‌ కావట్లేదు. కేవైసీ వివరాలు లేవన్నసాకుతో బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్లిపోతున్నాయి. ఒక్కసారి బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్లిన ఫాస్టాగ్ ను పురుద్ధరించడం... అదే వాహనానికి కొత్తది తీసుకోవడం కష్టంగా మారింది. టోల్‌గేట్ వద్దకు చేరుకున్నాకే ఆ సాంకేతిక సమస్యల గురించి తెలుసుకుంటున్న జనం చేసేది లేక చేతిచమురు వదిలించుకుంటున్నారు.

fast tag payments problems in mahabbobnagar
fast tag payments problems in mahabbobnagar

By

Published : Feb 20, 2021, 4:45 AM IST

Updated : Feb 20, 2021, 6:49 AM IST

ఫాస్టాగ్ ఉన్నా వడ్డింపులు... రీఛార్జ్ కాక వాహనదారుల అవస్థలు

ఫిబ్రవరి15నుంచి జాతీయ రహదారుల టోల్‌ప్లాజాల వద్ద వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలిచ్చింది. ఫాస్టాగ్ లేని వాహనాలకు అక్కడ రెట్టింపు నగదు వసూలు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాయకల్, శాఖపూర్, పుల్లూరు వద్ద టోల్ ప్లాజాలుండగా 85శాతం వాహనాలు ఫాస్టాగ్ ద్వారా టోల్ రుసుములు చెల్లిస్తున్నాయి. 15శాతం వాహనాలకు ఫాస్టాగ్ లేక రెట్టింపు రుసుమును వసూలు చేస్తున్నారు. అయితే కొందరు వినియోగదారులకు మాత్రం ఫాస్టాగ్‌ ఉన్నా అధికంగా రుసుము చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టోల్‌ప్లాజాల వద్ద వివిధ సంస్థలు ఫాస్టాగ్‌లు విక్రయిస్తున్నాయి. వాహన రిజిస్ట్రేషన్ పత్రం, ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని జారీ చేస్తున్నాయి. తొలుత బాగానే పనిచేసే ఫాస్టాగ్‌లను... కేవైసీ వివరాలు లేవనే సాకుతో బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నారు. ఆ సమాచారం తీరా... టోల్‌ప్లాజాకు చేరుకున్న తర్వాత గానీ వాహనదారుడికి తెలియట్లేదు. అప్పటికప్పుడు చేసేదిలేక రెట్టింపు నగదు చెల్లించి టోల్‌గేట్ దాటుతున్నారు.

ఫాస్టాగ్ రీఛార్జ్ చేసేందుకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. తీరా టోల్‌ప్లాజాకు చేరుకున్నాక ఖాతాలో డబ్బులు లేవని తెలిసి..... రెట్టింపు చెల్లించాల్సి వస్తోంది. సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా..టోల్ గేట్ నిర్వహకులు, ఫాస్టాగ్‌ సంస్థలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒకసారి బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్లిన ఫాస్టాగ్ ను పునరుద్ధరించడం, లేదంటే... అదే వాహన నెంబర్‌తో కొత్తది తీసుకునేందుకు వినియోగదారులు నానాతంటాలు పడుతున్నారు. ఫాస్టాగ్ ఖాతాలో డబ్బులు లేకుంటే ఒక్కసారి టోల్‌ప్లాజాను దాటేందుకు అవకాశం ఉంటుంది. వెంటనే రీచార్జ్ చేసుకుంటే సరి. పదేపదే ఖాతాలో డబ్బులు లేకుండా టోల్‌ప్లాజాలకు చేరితే ఆ వాహనాలను బ్లాక్‌లిస్టులో పెడతారు. ఒకసారి బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్లిన ఖాతాను పునరుద్ధరించుకోవడం సమస్యగా మారింది.

ఫాస్టాగ్‌ విక్రయించే సంస్థలు అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టిపెడుతున్నాయే తప్ప వాహనదారుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చూడండి:800కిలోమీటర్లు.. 900సీసీ కెమెరాలు.. చిక్కిన కిడ్నాపర్​

Last Updated : Feb 20, 2021, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details