Farmers Oppose Land Pooling: ప్రభుత్వ భూముల్ని స్థిరాస్తి వెంచర్లుగా అభివృద్ధి చేసి అమ్మడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సర్కారు భావిస్తోంది. ఇటీవల మహబూబ్‌నగర్‌లోని రాజీవ్ స్వగృహ ఇళ్ల స్థలాలను వేలంలో విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందింది. ప్రస్తుతం హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న భూముల్లో ఇదే తరహా వ్యాపారానికి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జాతీయ రహదారి వెంట గతంలో రైతులకు ఇచ్చిన అసైన్డ్ భూములను సేకరించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. బాలనగర్, రాజాపూర్, జడ్చర్ల, అడ్డాకుల మండలాల్లో స్థలాలను గుర్తించినట్లు సమాచారం. మాచారంలో 36, చిట్టెబోయినపల్లిలో 77 ఎకరాలు, నందిగామలో 50 ఎకరాలు, మోతీగణపూర్‌లోనూ భూములను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారులు తమతో సంప్రదింపులు జరిపారని... తాము వ్యతిరేకించామని రైతులు వెల్లడించారు.
మా భూములు మాకే ఉండాలి..
ఈ పొలాన్ని 1953లో ప్రభుత్వం మాకిచ్చింది. ఇప్పుడేమో అధికారులు వచ్చి ఈ భూమిని మాకు ఇచ్చేయండి. ఎకరాకు 400 నుంచి 500 గజాలను అభివృద్ధి చేసి ఇస్తామంటున్నారు. ఈ పద్ధతి మాకేం ఇష్టం లేదు. మా భూములు మాకే ఉండాలి. అడిగితే మీరు ఆవేశంతో మాట్లాడుతున్నారని అంటున్నారు. మేము ఆవేశంతో మాట్లాడట్లేదు.. బాధతో మాట్లాడుతున్నాం. -రైతు
మేమెలా బతకాలి..
కర్వెన జలాశయానికి 2 కిలోమీటర్ల దూరంలోనే పేదప్రజల 77 ఎకరాల భూములున్నాయి. ఈ భూములు మీరు తీసుకుంటే మా బతుకులెట్లా. మాకు ఉన్న ఆదెరువే ఈ పొలాలు. ఇవి తీసుకుంటే మేమెలా బతకాలి. -రైతు