Mahbubnagar Chilli farmers problems : జోగులాంబ గద్వాల జిల్లాలో మిరప పంట పండించిన రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనవరిలో 25వేలు పలికిన ఎండు మిరప ధర, ప్రస్తుతం 15 నుంచి 18వేలు పలుకుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడులు, తెగుళ్లదాడితో నష్టాల్లో ఉన్న తమకు. మార్కెట్ ధరలు శాపంగా మారయాంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పెట్టుబడులు కూడా చేతికి రాని పరిస్థితి..జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతి ఏటా సుమారు 25వేల మంది రైతులు 36వేల ఎకరాల్లో మిరప సాగు చేస్తారు. ఈ ఏడాది విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులన్నీ కలిపి ఎకరాకు లక్ష రూపాయలకు పైగానే పెట్టుబడి పెట్టారు. గత సంవత్సరం ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చిన మిరప..తామరపురుగు, ఆకుముడత తెగుళ్ల కారణంగా ఎకరాకు 2 నుంచి 10 క్వింటాళ్లకే పరిమితమైంది.జనవరిలో సూపరైన్ వంటి మిరపపంటకు మార్కేట్లో 26 వేలు పలకడంతో.. దిగుబడి తగ్గినా ధర బాగానే ఉందని రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం క్వింటాల్‌కి 15 నుంచి 18 వేలకు తగ్గింది. ఈ ధరకు అమ్మితే పెట్టుబడులు కూడా చేతికి రావని అంటున్నారు మిరప రైతులు.