మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వానాకాలం పంటల కొనుగోళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు 190 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రైతుల నుంచి పారదర్శకంగా పంటలను కొనుగోలు చేస్తూ... గిట్టుబాటు ధర కల్పిస్తామని పేర్కొన్నారు.
వానాకాలం పంటలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి వ్యవసాయ విస్తరణ అధికారులు కచ్చితమైన సమాచారాన్ని కలిగి ఉండాలని... ఏ రోజు ఏ గ్రామంలో ఎంత ధాన్యం కొంటున్నది రైతులు, రైస్ మిల్లర్లకు ముందే తెలిసేలా షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. ఎక్కువ మొత్తంలో వరి పంట వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైనన్ని గోదాములు గుర్తించి సిద్ధంగా ఉంచాలని... అవసరమైతే ఫంక్షన్ హాల్లు, ఇతర ఖాళీ స్థలాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు అవసరమైన లారీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.