తెలంగాణ

telangana

ETV Bharat / state

మినీ పోల్స్​: సర్వం సన్నద్ధం.. కరోనా చూపేనా పోలింగ్​పై ప్రభావం? - mini municipal elections updates

మినీపోరు కోసం ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని రెండు పురపాలికల యంత్రాంగం సన్నద్ధమైంది. ఈసారి కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల కొవిడ్ నిబంధనలకు లోబడి పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి కాగా.. ఓటర్ల కోసం అన్ని వసతులు కల్పించనున్నారు. సిబ్బందికి కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా మాస్కులు, సానిటైజర్లు, గ్లౌజులు, ఫేస్​షీల్డులు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను సానిటైజ్ చేయడంతో పాటు పోలింగ్ రోజున ఓటర్లు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

everything ready for mini municipal elections
everything ready for mini municipal elections

By

Published : Apr 28, 2021, 9:23 PM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలిక ఎన్నికల కోసం జిల్లా అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ ఏర్పడి పదేళ్లు గడిచినా.. తొలిసారిగా జడ్చర్ల పురపాలికకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం పట్టణాన్ని 27 వార్డులుగా విభజించగా... 48,731 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 27,883 మంది పురుష ఓటర్లు కాగా... 20847 మంది మహిళా ఓటర్లున్నారు. వీరి కోసం మొత్తం 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 20 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ప్రతి పోలింగ్ స్టేషన్​కు 2 బ్యాలెట్ బాక్సుల చొప్పున 108 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.

పోలింగ్​ శాతంపై ప్రభావం...

పోలింగ్ ప్రక్రియ కోసం 324 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఇప్పటికే ఓటరు స్లిప్పులను సైతం పంపిణీ చేశారు. గత శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో జడ్చర్ల, బాదెపల్లి, కావేరమ్మపేటల్లో సగటున 60 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఈసారి కొవిడ్ కేసులు పెరుగుతుండటం, కర్ఫ్యూ అమల్లో ఉండటం, కొవిడ్ నిబంధలు కచ్చితంగా పాటించాల్సి రావడం లాంటి అంశాలు... పోలింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొదటిసారి జరిగే ఎన్నికలు కావడం వల్ల అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం ఎంతగా నమోదవుతుందో వేచి చూడాల్సిందే.

ఈసారి అదే ఉత్సాహం ఉంటుందా...

అచ్చంపేట పురపాలిక ఎన్నికల కోసం సైతం అక్కడి అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. గత పాలక వర్గం గడువు... మార్చిలో ముగియడం వల్ల రెండోసారి అచ్చంపేట పురపాలికకు ఎన్నికలు జరుగుతున్నాయి. పట్టణాన్ని మొత్తం 20వార్డులుగా విభజించగా... 20684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 10,175 మంది పురుషులు కాగా.. 10,508 మంది మహిళలు. 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 80 బ్యాలెట్ బ్యాక్సులను సిద్ధం చేశారు. 240 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. పోలింగ్ అనంతరం అక్కడే స్ట్రాంగ్​ రూంతో పాటు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లుగా అచ్చంపేట మున్సిపల్ కమిషనర్ తెలిపారు. గత నగర పంచాయతీ ఎన్నికల్లో అచ్చంపేటలో 18614 మంది ఓటర్లకు గానూ... 13193 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ అదే స్థాయిలో నమోదు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కఠిన నిబంధనలు...

కొవిడ్ నిబంధనల అమలు కోసం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను సానిటైజేషన్ చేస్తూ... వస్తున్నారు. ఎన్నికలు జరిగే బహిరంగ ప్రదేశాలను సైతం పురపాలక సిబ్బంది ఎప్పటికప్పుడు క్రిమిసంహారక ద్రావణాలతో శుద్ది చేస్తూ వస్తోంది. ఎన్నికల్లో పాల్గొనే ప్రతి సిబ్బందికి ఈసారి రెండు మాస్కులు, హ్యాండ్ శానిజైటర్, ఫేస్ షీల్డ్, రెండు జతల హ్యాండ్ గ్లౌజులు కూడా అందిస్తున్నారు. ఓటర్ల కోసం ప్రతీ కేంద్రంలో 5 శానిటైజర్ సీసాలు అందుబాటులో ఉంచనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేందుకు వలయాలు గీసి ఉంచారు. కనీసం 2 మీటర్ల దూరం పాటించేలా వాటిని గీసి సిద్ధంగా ఉంచారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నారు.

ఇక అలంపూర్ మున్సిపాలిటీలో 5వ వార్డుకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నామపత్రం దాఖలు చేసిన ఏకైక అభ్యర్థి ఎరుకలి లక్ష్మీదేవమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇదీ చూడండి:పోలింగ్​లో కరోనా నిబంధనలు.. పాటించకుంటే కఠిన చర్యలు​

ABOUT THE AUTHOR

...view details