సామాజిక సేవే లక్ష్యంగా జగన్ అడుగులు.. ఛెజుబా పేరుతో ఆన్‌లైన్ వాలంటీరింగ్ Chezuba Co-founder Story: సమాజానికి ఏదో చేయాలనుకునే వారు చాలామందే ఉంటారు. కానీ అనుకున్న వారంతా సమాజహితానికి పాల్పడతారా అంటే అది సమాధానం లేని ప్రశ్నే. ఈ కుర్రాడు అలా కాదు. చదువుకునే సమయంలోనే విదేశాల్లో స్వచ్ఛంద సేవ చేశాడు. తనలా సేవ చేయాలనే ఆలోచన ఉన్న వారికి మార్గనిర్ధేశం చేస్తూ దేశంలోని ఎన్జీఓల ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు.
మహబూబ్‌నగర్‌లో పుట్టి పెరిగిన ఈ యువకుడి పేరు జగన్. చిన్ననాటి నుంచి సమాజానికి ఏదొకటి తిరిగి ఇవ్వాలన్న కోరికతో ఉండేవాడు. ప్రభుత్వ గురుకులాల్లోనే చదివిన జగన్... నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఐటీ విద్యను అందించే సూపర్ 40 ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యాడు. ఐఐటీ ధన్‌బాద్‌లో విద్యనభ్యసిస్తున్న జగన్‌కి తోటి విద్యార్థి సుఖేంద్రరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇద్దిరికీ ఎన్జీఓలకు పని చేద్దామన్న కోరిక బలంగా ఉండేది. సమాజానికి సేవ చేయాలనే తలంపుతో ఉన్న ఇద్దరు మిత్రులు ఎన్జీఓల సాయంతో మలేషియా, రష్యా వంటి దేశాలకు వెళ్లి పలు వాలంటీరింగ్ చేశారు. ఇక్కడే వారికి ఓ విషయం అర్థమైంది. చుట్టుపక్కల ఉన్న ఎన్జీఓలతో కలిసి పని చేయడం సులభమే.. కానీ వేరే రాష్ట్రాల్లో లేదా వేరే దేశాల్లో సేవ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న అంశం అని. ఆ ఆలోచనలోనే పుట్టింది ఛెజుబా అని చెబుతాడు జగన్.
ఆన్‌లైన్‌లో స్వచ్ఛందంగా సేవ చేసే అవకాశం... సామాజిక మాధ్యమాల ద్వారా వాలంటీరింగ్ చేయవచ్చనుకున్న లోకేశ్, సుఖేంద్ర మిత్రులు ఆన్‌లైన్‌లో ఛెజుబా పేరుతో ఓ వాలంటీరింగ్ వేదిక ఏర్పాటు చేశారు. సేవ చేయాలనే ఆలోచన ఉన్నవారు ప్రపంచంలోని ఏ మూలన ఉన్న ఎన్జీఓతోనైనా కలిసి పని చేయవచ్చని భావించారు. 2017లో చిన్నగా ప్రారంభమైన ఛెజుబా.. ప్రస్తుతం మాదాపూర్‌లో 20మంది ఉద్యోగులతో ఆఫీసు నడిపే స్థాయికి చేరింది. ఛెజుబా పని తీరు ఎలా ఉంటుందంటే... ఉద్యోగం చేస్తున్నవారైనా.. చదువుకుంటున్న వారైనా.. ఖాళీ సమయం దొరికినప్పుడు వారిలో ఉన్న నైపుణ్యం బట్టి తమకు తోచిన ఎన్జీఓకు ఆన్‌లైన్‌లో స్వచ్ఛందంగా సేవ చేసే అవకాశం కల్పిస్తుంది. ఇలా ఓ వైపు ఎన్జీఓ అవసరాలు... మరోవైపు స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే వారికి తోడ్పాటునందిస్తున్నట్లు చెబుతాడు జగన్.
ఆ పాయింట్లతో షాపింగ్ చేసుకునే రోజులు...ఎన్జీఓలకు ఉచితంగా సేవలందిస్తున్న ఛెజుబా.. సంస్థ నిలబడటానికి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఉద్యోగుల రిఫ్రెష్‌మెంట్‌లో భాగంగా స్వచ్ఛందంగా ఎన్జీఓలకు వాలంటీరింగ్ చేసే అవకాశం కల్పిస్తోంది. దీని కోసం ఆయా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఛెజుబా ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ వినియోగించుకుంటున్నాయని అంటాడు జగన్. ప్రజలకు ఎన్జీఓలకు మధ్య వారిధిగానే ఉండిపోకుండా... తాము చేసిన సేవకు ఛెజుబా వినియోగదారులకు తమ అకౌంట్లో పాయింట్లు వచ్చేలా ఒక మోడల్‌ను ఆవిష్కరించనున్నట్లు జగన్ చెబుతున్నాడు. ఆ పాయింట్లతో షాపింగ్ చేసుకునే రోజులు రానున్నాయని.. ప్రస్తుత సాంకేతికతో అది సులభమేనని అంటున్నాడు జగన్. సమాజానికి సేవ చేయాలనే తలంపుతో ఉన్న వారికి.. ఖాళీ సమయాల్లోనే ఆ అవకాశం కల్పిస్తున్న జగన్.. సమాజంపై తనకున్న బాధ్యత చాటుకుంటూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఇవీ చదవండి: