Etela fires on CM KCR at BJP Corner Meeting: హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తనదైన శైలిలో సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. మహబూబ్నగర్లో ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ఈటల... ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు కనీసం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం సీఎం కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
ఇది యావత్ తెలంగాణ దళితులను అవమానించినట్లేనని ఈటల మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు దళితులు అంటే ఎంత ప్రేమో దీనిని చూస్తే తెలుస్తోందన్నారు. మహబూబ్ నగర్‌లో ప్రజాగోస- బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ఈటల... రాష్ట్రంలో ధరణి పోర్టల్ పేదల కొంపలు ముంచిందన్నారు. ధరణితో తన ఫ్యూడల్ భావజాలాన్ని సీఎం కేసీఆర్ బయట పెట్టుకున్నారని ఆరోపించారు. కోటి ఎకరాల మాగాణిలో.. ప్రతీ సంచిలో నాలుగు కిలోల ధాన్యం దండుకుంటున్నారని ఈటల ధ్వజమెత్తారు.
'దేశంలోనే అత్యంత త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని చెబుతున్నారు. కానీ.. కనీసం అన్ని జిల్లాల ఉద్యోగులకు నెల నాడు జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. రుణమాఫీ ఒకే సారి సాధ్యం కాదని ఆనాడే చెప్పాను. బడ్జెట్లో కల్యాణ లక్ష్మి, సంక్షేమ పథకాలకు 30 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ.. మద్యం అమ్మకాల ద్వారా 45 వేల కోట్ల రూపాయలను రాబడుతున్నారు. ఇలా పేదోడిని త్రాగుబోతులను చేసి.. రోగాల పాలు చేస్తునారు. అటు కల్యాణలక్ష్మికి డబ్బులిచ్చి.. ఇటు తాళిబొట్టును తెంపుతున్నారు.'-ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
2018 నుంచి ఇప్పటివరకు మహిళా సంఘాలకు చెల్లించాల్సిన 4 వేల 5 వందల కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు చెల్లించలేదో చెప్పాలని నిలదీశారు. సంక్షేమ పథకాలకు నిధులిచ్చినట్లే ఇచ్చి... మద్యం అమ్మకాల ద్వారా 45 వేల కోట్ల రూపాయలు రాబట్టుకుంటున్న ప్రభుత్వం పేదలను తాగు బోతులుగా చేస్తోందని విమర్శించారు.
ఒకవైపు కల్యాణలక్ష్మికి డబ్బులిస్తూ.. మరోవైపు తాళిబొట్టు తెంపుతున్నారు: ఈటల ఇవీ చదవండి: