Etela Rajender on Governor : కేసీఆర్ తప్పులు చేస్తూ రైతులను వెంటపడి వేధిస్తున్నారని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మోర్చా రైతు సదస్సులో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో ఆయన కలిసి పాల్గొన్నారు. రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఓ రకమైన సెంటిమెంట్‌ను సృష్టించి కేంద్రంపై నిందలు వేస్తున్నారని ఈటల అన్నారు. పార్టీలతో రాజకీయం చేయాలని... రైతుల జీవితాలతో చెలగాటం ఆడకూడదని హితువు పలికారు.
బియ్యంతో పాటు నూకలకు కూడా ఎఫ్‌సీఐ ధర కట్టిస్తుందని... అది పోను సుమారు రూ.వెయ్యి కోట్లు అదనంగా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ అంశం కేంద్రంతో మాట్లాడితే సరిపోతుందన్నారు. కానీ.. కేవలం రూ.వెయ్యి కోట్ల సమస్య కాదు... ఇది కుర్చీ సమస్య అయ్యిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు వ్యతిరేకంగా ఉందని ఓ అసత్యాన్ని, విషబీజాన్ని నాటేందుకు చేసిన కుట్రనే ఈ వడ్ల సమస్యని ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. ఎవరి జోలికి వెళ్లని రాజ్యాంగ పరిరక్షకురాలు తమిళిసై అని.. ఎంతో చదువుకుని సంస్కారం ఉన్న కేటీఆర్... గవర్నర్ పట్ల మాట్లాడిన మాటలు చాలా బాధ కలిగించాయని ఈటల పేర్కొన్నారు. ఇవాళ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ముఖ్యమంత్రికి ఆ కుర్చీపై కూర్చునే నైతిక హక్కు లేదన్నారు.