Errakunta Pond Occupancy in Mahabubnagar : హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి వెంట ఉన్న మహబూబ్నగర్ జిల్లా బాలానగర్‌లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు దస్త్రాల్లోని లొసుగుల్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, కాల్వల్ని దర్జాగా మాయం చేస్తున్నారు. బాలానగర్‌లో 53 ఎకరాల్లో పెద్దచెరువు విస్తరించి ఉంది. ఆ చెరువు, కాలువకు ఆనుకుని 118 సర్వే నెంబర్లో 27 ఎకరాల భూమి ఉంది.
Errakunta Pond Kabja in Mahabubnagar : పహణీ ప్రకారం ఆ స్థలం సర్కారు భూమి. తర్వాత అసైన్డు కింద రైతులకు భూములిచ్చారు. అందులో 17 ఎకరాలకు నిరభ్యంతర పత్రం ఇవ్వగా.. అవి పట్టా భూములుగా మారాయి. మిగిలిన 8 ఎకరాల్లో అసైన్డుదారులున్నారు. ఇవి పోగా రెండెకరాల ప్రభుత్వ భూమి ఆ సర్వే నెంబర్‌లో ఉండాలి. ఆ రెండెకరాలు చెరువునకు ఆనుకుని ఉన్నట్లుగా గుర్తించి అక్కడ వైకుంఠదామాన్ని నిర్మించారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు తమ భూమంటూ వైకుంఠదామాన్ని కూల్చివేశారు. మరోచోట సొంత ఖర్చులతో పట్టాదారులే నిర్మించి ఇచ్చారు. అంతా సవ్యంగా కనిపిస్తున్నా, వైకుంఠ ధామం నిర్మించిన భూమి పట్టాభూమైతే 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు ఆ భూమి విలువ రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ..
'' గతంలో ఇక్కడ ఎర్రకుంట కాలువ ఉండేది. దీనిని కబ్జాదారులు మాయం చేసి 100 ఎకారాలలో వెంచర్లు చేశారు. నీళ్లు పోవడానికి వీలు లేకుండా చేసి స్థలాలను అమ్ముకున్నారు. లేఅవుట్ పర్మిషన్ లేకున్నా ఇక్కడ వెంచర్లు చేశారు. భవిష్యత్తులో ఇక్కడ ఇండ్లు కట్టుకున్నా వర్షానికి వరద నీరుతో ఇబ్బంది పడతారు. గతంలో దీని గురించి ఎమ్మార్వో, కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుంట స్థలాన్ని కాపాడాలని కోరుతున్నాం.'' -తిరుపతి స్థానికుడు
పెద్ద చెరువు అలుగు పారితే చిన్న చెరువుకు వెళ్లడానికి అప్పట్లో కాలువ ఉండేది. స్థిరాస్తి వ్యాపారం కోసం కొందరు కాల్వను కప్పేశారు. అందుకు ప్రత్యామ్నాయంగా మరో కాల్వను తవ్వుతున్నారు. కొత్త కాలువలోనే మిగిలిన రెండెకరాల ప్రభుత్వ భూమి ఉందని చూపే ప్రయత్నాలు సాగుతున్నాయి. అధికారులు, స్థిరాస్తి వ్యాపారులు అంతా కుమ్మక్కై మొత్తంగా 118 సర్వే నంబర్‌లో రెండెకరాల భూమిని మాయం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.