నాడు పల్లెల్లో పనుల్లేవంటూ పట్టణాలకు వలస బాట పట్టిన బిడ్డలు ఇప్పుడు కొవిడ్ సంక్షోభంతో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు తిరిగొస్తుంటే సంతోషంగా పల్లె స్వాగతం పలుకుతోంది. ఏదో ఒక పని చూపిస్తూ.. అమ్మప్రేమను పంచుతోంది. కరోనాతో.. పట్టణాల్లో ఉపాధి కోల్పోయిన లక్షలాది కుటుంబాలు పిల్లలతో సహా ఇప్పుడు సొంతూళ్లకు చేరాయి. అక్కడే పొలం పనులు చేసుకుంటూ.. ఉపాధి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నాయి.. ఇక్కడ వచ్చే డబ్బులతోనే కొంతమంది పట్టణాల్లో ఇంటద్దెలు చెల్లిస్తున్నారు కూడా! ప్రస్తుతం ఏ పల్లెలో చూసినా చాలాకాలం తరవాత తిరిగొచ్చిన ముఖాలు కొత్తగా కనిపిస్తున్నాయి. ఉన్నత విద్యావంతులు, ఏసీ గదుల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తూ సుఖంగా జీవించేవారు సైతం పొలాల్లో బురదలో దిగి పనిచేస్తుంటే గ్రామీణులు ఆశ్చర్యపోతున్నారు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. అలాంటి వారిలో కొందరిని ‘ఈనాడు- ఈటీవీ భారత్’ పలకరించింది.
రైతును అర్థం చేసుకున్నాం!
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన మాదిరెడ్డి బాల్‌రెడ్డి ఇంజినీరింగ్ చదివి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కరోనా సంక్షోభంతో కంపెనీ యాజమాన్యం ఉద్యోగులను తొలగించింది. ఇంటికొచ్చి వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ఇదే మండలం మహదేవునిపేట గ్రామానికి చెందిన గుండాల మల్లేశ్ హైదరాబాద్‌లోని ఓ జూనియర్ కళాశాల్లో అధ్యాపకునిగా పనిచేశాడు. కరోనా మహమ్మారి తగ్గకపోవడంతో కళాశాలలు తెరవక ఉపాధి కరవై సొంతూరుకు వచ్చాడు. తన పొలంలో పనులు చేసుకుంటున్నాడు.
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి ఫార్మాలో డిగ్రీ పూర్తి చేసి ఓ ఫార్మా కంపెనీలో గత పదేళ్లుగా పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా సదరు యాజమాన్యం ఉద్యోగులను తొలగించింది. కరుణాకర్‌రెడ్డి గ్రామానికి వచ్చి తన 5 ఎకరాల పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ‘‘ఇంతకాలం ఉద్యోగాల ఒత్తిడిలో ఇన్ని నెలల కాలం స్వగ్రామాల్లో ఉండలేదు. ఇప్పుడు చాలాకాలం ఉండటం వల్ల పల్లె జీవన సౌందర్యాన్ని తనివి తీరా చూసే అవకాశం కలుగుతోంది. వ్యవసాయం చేయడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు స్వానుభవానికి వస్తున్నాయి. మనం తినే ఆహారాన్ని పండించడానికి ఎంత శ్రమ అవసరమో అర్థమైంది. పల్లెజీవనం, వ్యవసాయంలో ఉన్నంత స్వేచ్ఛ, ప్రశాంతత ఉద్యోగంలో ఎన్నటికీ ఉండ’’దని వారు స్పష్టం చేశారు.