ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికలు జరగని మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు... అధికార యంత్రాంగం కసరత్తులు ముమ్మరం చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీల్లో పాలక వర్గాల గడువు ముగిసిన నేపథ్యంలో ఎన్నికల కసరత్తు మొదలైంది. కావేరమ్మపేట గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు డిసెంబర్ నాటికి ముగియడంతో... ప్రభుత్వం అంతకుముందున్న బాదేవల్లి, కావేరమ్మపేటలను కలిపి జడ్చర్ల మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది. జడ్చర్ల పురపాలిక జనాభా 52వేలు కాగా, పురపాలికలను 27వార్డులుగా విభజించారు. వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించారు. మార్చి 30న తుదిప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వార్డుల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను సైతం విడుదల చేశారు. ఓటర్ల సంఖ్య 41వేలు కాగా పురుష, మహిళ ఓటర్లు 20వేలకు పైగా ఉన్నారు. ఓటర్ల జాబితాపైనా అభ్యంతరాలను ఇవాళ్టి వరకూ స్వీకరించనున్నారు. 10వ తేదీన అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం.. 11న తుదిజాబితా ప్రకటించనున్నారు. ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను సైతం ఎంపిక చేశారు. వార్డుకు 2 చొప్పున మొత్తం 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల ఎంపిక సైతం పూర్తైంది. పోలింగ్ అధికారులు, సిబ్బందిని గుర్తించాల్సి ఉంది. ప్రతి అంశంపై... జిల్లా, మున్సిపాలిటీ స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలను సైతం కొనసాగుతున్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలిక పాలకవర్గం గడువు మార్చి 14తో ముగిసింది. దీంతో ఎన్నికల కోసం అక్కడా కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం అచ్చంపేట పట్టణ జనాభా సుమారు 35వేలకు పైగా ఉంటుంది. పట్టణాన్ని 20వార్డులుగా విభజించారు. వార్డుల పునర్విభజన ప్రక్రియసైతం పూర్తైంది. వార్డుల వారిగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. మొత్తం 20వేల 529 మంది ఓటర్లుండగా వారిలో పురుషులు 10వేల100, మహిళలు 10వేల428 మంది ఉన్నారు. వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరుల ముసాయిదా కులగణన జాబితాను సైతం అధికారులు వెల్లడించారు. ఓటర్లలో ఎస్సీలు 3వేల146, ఎస్టీలు 1057, బీసీలు 13 వేల 301 మంది ఉన్నారు. ఇతరులు 3024 మంది. మొత్తం 20వార్డులకు గాను 40 పోలింగ్ కేంద్రాలను సైతం అధికారులు గుర్తించి, ఎన్నికల అధికారుల నియామక ప్రక్రియను ప్రారంభించారు. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రానికి 513 మంది ఓటర్లు ఉండనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా, కుల గణనపైనా అభ్యంతరాలు స్వీకరించి తుదిజాబితాలు ప్రకటించనున్నారు.