తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరులో ఊపందుకోనున్న ప్రచారం

పార్లమెంటు అభ్యర్థుల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక ప్రచార పర్వం ఊపందుకోనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన పార్టీలు ఓవైపు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు కొనసాగిస్తూనే మరోవైపు అగ్రనేతల సభలతో ప్రజలను ఆకర్షించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

By

Published : Mar 26, 2019, 6:05 AM IST

Updated : Mar 26, 2019, 6:41 AM IST

ఎన్నికల కోలాహలం

ఎన్నికల కోలాహలం
నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంటరీ నియోజకవర్గాలను తెరాస, కాంగ్రెస్, భాజపాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

31న కేసీఆర్ సభ...

తెరాస అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలంటూ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ఇప్పటికే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. నాగర్ కర్నూల్​లో అభ్యర్థి పోతుగంటి రాములుతోపాటు మంత్రి నిరంజన్ రెడ్డి... 7 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలను సన్నద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 31న వనపర్తి, మహబూబ్​నగర్​ సభల్లో పాల్గోనున్నారు.

29న కమల దళపతి రాక...

మొదటి నుంచి మహబూబ్​నగర్​ను సెంటిమెంట్​గా భావిస్తున్న భాజపా... దక్షిణ భారతదేశంలో ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనుంది. మహబూబ్​నగర్​ అభ్యర్థి డీకే అరుణ తరఫున ప్రచారం చేసేందుకు ఈనెల 29న నిర్వహించే సభకు ప్రధాని మోదీ రానున్నారు. మరోవైపు నాగర్ కర్నూల్​ అభ్యర్థి బంగారు శృతి జాతీయ స్థాయి నేత కావడం వల్ల కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాహుల్​, ప్రియాంక రోడ్​షోలకు సన్నాహకాలు...

కాంగ్రెస్ అగ్రనేతలను ప్రచారానికి దింపాలని యోచిస్తోంది. మహబూబ్​నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రాహుల్, ప్రియాంక రోడ్​షోలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు చల్లా వంశీచంద్​ రెడ్డి, మల్లు రవి.. ఆయా నియోజకవర్గాల సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు.

అగ్రనేతల పర్యటనలు, ప్రచార సభలు, ఇంటింటి ప్రచారాలతో పాలమూరు జిల్లాలో ఎన్నికల కోలాహలం నెలకొననుంది.

ఇవీ చూడండి:"రోడ్​షోలు, బైక్​ర్యాలీలపై నిషేధం లేదు"

Last Updated : Mar 26, 2019, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details