Eco Friendly Food Served in marriage: మహబూబ్‌నగర్‌లోని వాసవి కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో రాజ నర్సింహా-ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. వివాహానికి వచ్చే బంధువులకు ప్రకృతి సేద్యం ద్వారా పండిన పంటలను మాత్రమే ఆహారంగా చేయించాలని సంకల్పించారు రాజనర్సింహా. దీనికోసం ఎటువంటి రసాయనాలు, పురుగు మందులు వాడకుండా గో ఆధారిత సాగుతో పండించిన దేశవాళీ బియ్యం రకాలు, పప్పులు, కూరగాయలు, వంట దినుసులు తెప్పించారు. గానుగ నూనె, దేశీ ఆవు పాల నుంచి తీసిన నెయ్యి.. వనమూలికలతో శుద్ధిచేసిన మంచినీళ్లతో భోజనం సిద్ధం చేశారు. వంటకు వాడిన ముడి సరుకుల్లో 90 శాతం పాలమూరు రైతుల నుంచి తెప్పించడం విశేషం.
సహజంగా వివాహమనగానే భోజనానికి సన్న, బాసుమతి రకాల బియ్యాన్ని వినియోగించడం సాధారణం. కానీ ఈ పెళ్లిలో మాత్రం దేశవాళీ బియ్యంతో రకరకాల వంటకాలు చేశారు. నవారాతో ఉప్మా, బహురూపితో కేసరి, రత్నచోడితో కొత్తిమీర అన్నం, మైసూర్ మల్లిగతో కరివేపాకు అన్నం, జీరాసాంబా తెల్లన్నం, కృష్ణబియ్యంతో బెల్లం పొంగలి, సిద్ధ సన్నాలతో బిర్యానీ, దిల్లీ బాసుమతితో పన్నీర్ బిర్యానీ, కుంకుమపువ్వు కలిపిన పూర్ణాలు, ఆకుకూరలతో ఇడ్లీ, ఆవుపాలతో పెరుగు వడ్డించారు.
తాము జరిపే శుభకార్యంతో పర్యావరణానికి హాని కలగొద్దన్న ఉద్దేశంతో అరటి ఆకుల్లో భోజనం పెట్టారు. స్టీలు, మట్టి గ్లాసుల్లో నీళ్లందించారు. పర్యావరణహిత పళ్లాల్లో అల్పాహారాలు, తీపి పదార్థాలను వడ్డించారు. శీతల పానీయాల జోలికి వెళ్లకుండా చెరుకు రసాన్ని అందించారు. ఎక్కడా ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా జాగ్రత్త పడ్డారు.