తెలంగాణ

telangana

ETV Bharat / state

Drone technology : యువత చూపు డ్రోన్ల వైపు.. ట్రిపుల్ఐటీ కర్నూల్​ బూట్​క్యాంప్​ - Telangana latest news

Drone technology bootcamp in IIIT kurnool : డ్రోన్.. ఒకప్పుడు రక్షణ రంగానికే పరిమితమైన టెక్నాలజీ ఇది. ఆ తర్వాత అత్యవసర సేవలు, భద్రత, మీడియా సహా వీటి వినియోగం వివిధ రంగాల్లో పెరుగుతూ వస్తోంది. భవిష్యత్తులోనూ డ్రోన్ల వినియోగం మరింత విస్తృతం కానుంది. అందుకే డ్రోన్ల తయారీ, వినియోగం, నిర్వాహణ, అప్లికేషన్స్ పై దేశవ్యాప్తంగా శిక్షణలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా ట్రిపుల్ ఐటీ కర్నూల్ ఆధ్వర్యంలో మొదటిసారిగా డ్రోన్ టెక్నాలజీపై బూట్ క్యాంప్ నిర్వహించారు. ఆ క్యాంప్‌ విశేషాలేంటి? యువత భవిష్యత్‌కు ఆ సాంకేతికత ఎలా దోహదం చేస్తుందో ఈ కథనంలో చూద్దాం.

Drone
Drone

By

Published : Jun 27, 2023, 10:27 PM IST

యువత చూపు డ్రోన్ల వైపు.. ట్రిపుల్ఐటీ కర్నూల్​ బూట్​క్యాంప్​

Drone technology bootcamp in IIIT kurnool : ఒకప్పుడు కొందరు సంపన్నుల చేతిలోనే కనిపించిన మొబైల్ ఫోన్.. ప్రస్తుతం సామాన్యుడి వరకూ ఎలా విస్తరించిందో.. రానున్న రోజుల్లో డ్రోన్ల వినియోగం అలాగే ఉంటుందని అనడంలో సందేహం లేదు. అందుకే కేంద్రప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ట్రిపుల్ ఐటీ కర్నూల్ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ క్యాంప్‌లో ఆసక్తిగల విద్యార్థులు పాల్గొని భవిష్యత్‌ అవకాశాలకు మార్గంపై ఎంతో అవగాహన పెంచుకున్నారు.

దేశవ్యాప్తంగా శిక్షణ.. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపెంచాలని కేంద్రం సంకల్పించింది. 2026 నాటికి ఈ రంగం 15వేల కోట్ల పరిశ్రమగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తోంది. అందుకే డ్రోన్లపై దేశవ్యాప్తంగా అవగాహన, నైపుణ్య శిక్షణ, పరిశోధన, అప్లికేషన్, స్టార్టప్‌లను ప్రోత్సహించాలని భావిస్తోంది ప్రభుత్వం. అయిదేళ్లలో 70వేల మందికి ఈ రంగంలో నైపుణ్యశిక్షణ అందించేందుకు ఐఐటీ, ఎన్ఐటీ లాంటి 30 సంస్థల్నిఎంపిక చేసింది.

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐఐటీ, ఎన్ఐటీ కళాశాల్లో బూట్‌ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలా ఎంపికైన కళాశాల్లో కర్నూల్‌ ట్రిపుల్‌ ఐటీ కూడా ఒకటి. ఈ కళాశాల ఆధ్వర్యంలో మెుదటి డ్రోన్‌ నైపుణ్య శిక్షణ ఇటీవల ప్రారంభించారు. తెలంగాణ మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆసక్తిగల 118 మంది విద్యార్థిని, విద్యార్ధులు 5 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు.

డ్రోన్స్​ వినియోగంలో తర్ఫీదు.. అయిదు రోజుల పాటు బూట్ క్యాంప్‌లో డ్రోన్స్​పై అవగాహన కార్యక్రమం జరిగింది. విడిభాగాలు వాటి తయారీ, డ్రోన్స్ అమర్చడం, ఎగురవేయడం, తిరిగి భాగాలుగా విడదీయడం.. వివిధ రంగాల్లో డ్రోన్స్ ఎలా వినియోగిస్తున్నారు. భవిష్యత్లులో మరిన్ని రంగాల్లో వాటిని ఎలా వినియోగించవచ్చన్న అంశాల్ని.. ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్లు విద్యార్ధులకు వివరించారు.

భవిష్యత్తులో ఏ ఇంజనీరింగ్ విభాగమైనా సరే డ్రోన్స్ వినియోగం తప్పక ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్ధులు నిర్మాణరంగంలో.. ఎంబీఏ విద్యార్థులు వ్యాపారంలో ఉపయోగించవచ్చు. అందుకే విద్యార్ధి దశలోనే డ్రోన్స్‌పై శిక్షణ తీసుకుని భవిష్యత్తు అవకాశాల్ని మెరుగుపరచుకోవాలి. అలాగే పదిమందికి ఉపాధి అవకాశాలు కల్పించే మార్గానికి బాటలు వేసుకోవాలని సూచిస్తున్నారు.

భవిష్యత్త్​లో అద్భుతాలు.. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక్కోరంగంలో ఒక్కోలా వాడుకుంటున్నారు. అందుకే నేటి యువతకు డ్రోన్లపై అవగాహన, నైపుణ్యం తప్పనిసరని అధ్యాపకులు అంటున్నారు. బహిరంగ మార్కెట్లో డ్రోన్ శిక్షణ కేంద్రాలు చాలానే ఉన్నాయని.. కాకపోతే విద్యార్ధులకు సరైన శిక్షణ ఇవ్వడం వల్ల భవిష్యత్త్‌లో వారు అద్భుతాలు సృష్టిస్తారని కర్నూల్ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సోమయాజులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం ప్రభుత్వ సహకారంతో అందిస్తున్న డ్రోన్ నైపుణ్య శిక్షణను ఇప్పటికే కర్నూలుకు చెందిన 120 మంది యువతులు పూర్తి చేసుకున్నారు. కొద్ది రోజుల్లో జేఎన్​టీయూ అనంతపురం.. సహా వివిధ ప్రాంతాల్లో బూట్ క్యాంపులు నిర్వహించనున్నారు. 5 వేల మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ట్రిపుల్ ఐటీ కర్నూల్ ముందుకు సాగుతోంది. ఆసక్తి ఉన్న విద్యార్ధులెవరైనా సరే తమను సంప్రదిస్తే శిక్షణ ఇప్పిస్తామంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details