Double Bed Rooms Fraud: మహబూబ్‌నగర్‌లో ఇటీవల డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరిట డబ్బులు వసూలు చేసి.. జనాన్ని మోసగించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో పోలీసులు కొందరిని అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జిల్లా అధికారులు సైతం అంతర్గత విచారణ చేపట్టారు. దివిటిపల్లిలో ఇళ్ల కేటాయింపుల వ్యవహారం ప్రస్తుతం పాలమూరులో హాట్ టాపిక్‌గా మారింది. రూ.62 కోట్లతో దివిటిపల్లిలో 1,024 రెండు పడక గదుల ఇళ్లు నిర్మించారు. 2018లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆ ఇళ్లను ప్రారంభించారు.
పట్టాలిచ్చారా.. అప్పగించారా..: అప్పట్లో కొంతమందికి లక్కీడిప్ ద్వారా ఇళ్లను కేటాయించారు. ఆ తర్వాత అక్కడి ఇళ్లను ఎవరికి ఇచ్చారు..? ఏ ప్రాతిపదికన కేటాయించారన్న అంశం రెవెన్యూ అధికారులకు తప్ప ఎవ్వరికీ తెలియదు. దివిటిపల్లిలో 800 మందికి ఇళ్లు కేటాయించామని చెబుతున్నా.. 200 మందే అక్కడ నివాసం ఉంటున్నారు. మిగిలిన వాళ్లకు పట్టాలిచ్చారా.. ఇళ్లు అప్పగించారా అనేవి సశేష ప్రశ్నలుగానే మిగిలాయి. లబ్ధిదారుల జాబితాను బహిరంగంగా ప్రకటించకపోవడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అర్హత లేని వారికి చోటు కల్పించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అర్హుల జాబితా బయటపెట్టాలి..: ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన ముఠా.. నకిలీ పట్టాలు ఎలా తయారు చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పట్టాలపై రెవెన్యూ శాఖ ముద్రలు, సంతకాలు ఎలా వచ్చాయనేది విచారణలో తేలాల్సి ఉంది. మహబూబ్‌నగర్ అర్బన్ రెవెన్యూ కార్యాలయం వేదికగా అక్రమాలు జరిగాయనే విమర్శలతో.. ఆ దిశగా దర్యాప్తు చేస్తామని పోలీసులు ప్రకటించారు. తాము మోసపోయామంటూ ఇప్పటికే పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అర్హుల జాబితా బయట పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌లో రెండు పడక గదుల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు విచారణలో ఏం తేలుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.