కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు లాభమే కానీ.. ఎటువంటి పరిస్థితుల్లో నష్టం కలుగదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. రాజకీయ పార్టీలు ఆ చట్టాలలో లేని అంశాలను చూపించి.. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో డీకే అరుణ ఆ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రైతులకు మేలు చేసేందుకే మోదీ ఈ చట్టాల్ని తీసుకువచ్చారని వివరించారు. మార్కెట్ యార్డులు లేకుండా పోతాయని, కనీస మద్దతు ధర ఉండదని, వ్యవసాయం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నారని.. అవి అవాస్తవమని పేర్కొన్నారు.