దగ్గర పడుతున్న గడువు... ధరణి సాగేనా సాఫీగా..? తహసీల్దార్ కార్యాలయాల్లోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సహా ఇతర లావాదేవీలు జరిగేలా... దసరా రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పరికరాలు, సిబ్బందిని సమకూర్చింది. తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, సిబ్బందికి శిక్షణ ఇచ్చి రోజుకు 10 నమూనా లావాదేవీలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌కు సంబంధించిన నమూనా లావాదేవీల నిర్వహణపై అధికారులు నిమగ్నమయ్యారు. స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భాగ పరిష్కారాలు, వారసత్వ బదిలీ సంబంధిత లావాదేవీలు ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పైస్థాయి అధికారులకు తెలియజేస్తున్నారు. ధరణి పోర్టల్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ధరణి పోర్టల్ వల్ల ప్రయోజనాలివి...
ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా కోరుకున్న సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్టాంప్ డ్యూటీ, బదిలీ, రిజిస్ట్రేషన్, పాస్ పుస్తకం, మ్యూటేషన్ రుసులు ఆన్లైన్లో చెల్లించవచ్చు. కార్యాలయాల వద్ద అధికారుల కోసం పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదు. తెలుగు, ఆంగ్లం కావాల్సిన భాషలో దరఖాస్తు చేసుకోవచ్చు. క్రమవిక్రయాలకు ముందు, తర్వాత లావాదేవీలు సరిగ్గా ఉన్నాయా లేదా సిటిజన్ పోర్టల్ సరిచూసుకోవచ్చు.
-తేజస్ నందలాల్ పవార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
విక్రేత లేదా కొనుగోలుదారుడు ముందుగా ధరణిలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నిర్ణీత సమయానికి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తే.. అదే రోజు దస్త్రాలన్నీ పరిశీలించి లావాదేవీలు పూర్తి చేస్తారు. ఫొటో, ఆధార్, బయోమెట్రిక్, సహా వివిధ దస్త్రాలు పరిశీలించి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సైతం అదే రోజు పూర్తవుతుంది. విక్రేత అమ్మిన భూమి విస్తీర్ణాన్ని... ఆయన పట్టాదారు పాస్ పుస్తకంలో తొలగించి కొనుగోలుదారుని పట్టాదార్ పాస్ పుస్తకం ఖాతాలో చేర్చుతారు. కొనుగోలుదారునికి ఎలాంటి వ్యవసాయ భూములు లేకపోతే... కొత్త పట్టాదారు పాస్ పుస్తకం కొరియర్ ద్వారా ఇంటికి పంపిస్తారు. కేవలం అరగంట సమయంలో లావాదేవీలు పూర్తవుతాయి. ధరణి పోర్టల్ నిర్వహణ సులువుగా ఉందని అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్ నెట్ వేగం ప్రధాన సమస్యగా మారింది. దరఖాస్తులో పాన్ కార్డును సైతం అడుగుతుండగా... గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరికీ అవి లేవు. కొనుగోలుదారుడు, విక్రేత కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు రిజిస్ట్రేషన్‌కు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు లేకపోతే ఏం చేయాలన్న అంశం ఇప్పటికే పైఅధికారుల దృష్టికి వెళ్లింది.
ప్రతి తహసీల్దార్ 10 నుంచి 20 వరకూ డమ్మీ లావాదేవీలు నిర్వహిస్తున్నాం. భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ధరణితో అరగంటలో లావాదేవీలు పూర్తి చేయవచ్చు. సాఫ్ట్ వేర్ ఇబ్బందులు లేవు. సమస్యలు ఎదురైనప్పుడు అధికారుల దృష్టికి తీసుకు వెళ్తే వెంటనే పరిష్కరిస్తున్నారు.
-పి.శంకర్, రాజాపూర్ తహసీల్దార్
ఆధార్ అప్‌డేషన్, పేర్లు, విస్తీర్ణంలో తప్పుల సవరణలు, సర్వే నెంబర్, మిస్సింగ్ సర్వే నెంబర్లు, ఒకటి కంటే ఎక్కువగా ఉన్న ఖాతాలను ఒకే ఖాతాగా చేయడం లాంటి ఆప్షన్లు ఇప్పటికీ పోర్టల్‌లో లేవు. అధికారికంగా ప్రారంభించే పోర్టల్‌లో వాటికి అవకాశం ఇవ్వవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:ఈనెల 27 నుంచి వ్యవసాయ డిప్లోమా కౌన్సిలింగ్