తెలంగాణ

telangana

ETV Bharat / state

Devarakadra Railway Gate : రైల్వేగేటు మూశారు.. కొత్త ప్రాబ్లమ్స్​ తెచ్చారు - రైల్వేగేటు మూసివేయంతో దేవరకద్ర ప్రజలకు ఇబ్బందులు

Devarakadra Railway Gate Closed : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో రైల్వే ఓవర్​బ్రిడ్జి నిర్మాణంతో కొత్త కష్టాలు ఎదురయ్యాయి. ఈ వంతెనతో దశాబ్దాల ప్రయాణ కష్టాలు తీరుతాయని భావిస్తే.. అక్కడి రైల్వేగేటును శాశ్వతంగా మూసివేయడం ఇబ్బందుల్ని తెచ్చిపెట్టింది. గేటుమూతతో ఒక వైపు నుంచి మరోవైపు వెళ్లాలనుకునే ప్రయాణికులు చుట్టూ తిరిగి ఆర్వోబీ మీదుగా రావాల్సి వస్తోంది. జనం లేక గేటుకు ఇరువైపులా వ్యాపారాలు దెబ్బతిన్నాయి.

GATE
GATE

By

Published : May 19, 2023, 9:04 AM IST

దేవరకద్రలో రైల్వేగేటు మూసివేతతో స్థానిక ప్రజలకు కొత్త కష్టాలు

Devarakadra Railway Gate Closed : 167వ నెంబర్ జాతీయ రహదారిపై మహబూబ్​నగర్ నుంచి రాయచూరు వెళ్లే మార్గంలో.. రైల్వేగేటును శాశ్వతంగా మూసివేశారు. దేవరకద్రలో రూ.24 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్​బ్రిడ్జిని ఈనెల 8న మంత్రి ప్రశాంత్​రెడ్డి ప్రారంభించారు. అనంతరం అక్కడున్న రైల్వేగేటును ఈనెల 17 నుంచి శాశ్వంతగా మూసివేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. 18 నుంచి అక్కడి గుండా రాకపోకలు ఆగిపోయాయి. గేటుకు సమీపంలో ఉన్న బస్టాండ్‌కు బస్సులు రావడం లేదు.

దేవరకద్రలో దిగాల్సిన ప్రయాణికులను ఆర్వోబీకి ఇరువైపులా దించేసి.. బస్సులు నేరుగా వెళ్లిపోతున్నాయి. హైదరాబాద్, రాయచూరు, నారాయణపేట, ఆత్మకూరు సహా వివిధ కేంద్రాలకు వెళ్లే బస్సులు 300లకు పైగా బస్టాండ్‌కు వచ్చి వెళ్తుంటాయి. ప్రస్తుతం వాటిలో పల్లెలకు వెళ్లే కొన్ని బస్సులు మినహా చాలా బస్సులు రావడం లేదని ప్రయాణికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవరకద్ర పట్టణం నియోజవర్గ కేంద్రం కావడంతో నిత్యం ఇక్కడకు వేలాది మంది వచ్చి వెళ్తుంటారు.

రైల్వేగేటును యథాతథంగా నిర్వహించాలి : బుధవారం జరిగే పశువుల సంత రాష్ట్రంలోనే పేరెన్నికగన్నది. రైల్వేగేటు సమీపంలోని దుకాణాల్లో నిత్యం కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుంది. గేటు మూతతో ప్రస్తుతం ఇక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రైల్వేగేటుకు ఒకవైపు ప్రభుత్వాసుపత్రి, పోలీస్ స్టేషన్, మండల కార్యాలయాలున్నాయి. మరోవైపు బస్టాండ్ సహా ఇతర వ్యాపారాలున్నాయి. దేవకరద్రకు వచ్చే జనం తమ అవసరాల కోసం ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లాలంటే చుట్టూ తిరిగి ఆర్వోబీపై నుంచి వెళ్లాల్సి వస్తోంది. అందుకే ఆర్వోబీ ఉన్నా రైల్వేగేటును యథాతథంగా నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అసంపూర్తిగా ఆర్వోబీ పనులు : ఆర్వోబీని లాంఛనంగా ప్రారంభించినా అన్ని పనులు పూర్తికాకపోవడం ప్రయాణికుల ఇబ్బందులకు మరోకారణం. ముఖ్యంగా సర్వీసు రోడ్లు పూర్తి కాలేదు. వంతెనకు ఇరువైపులా ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయలేదు. ఆర్వోబీ నుంచి సర్వీసు రోడ్డులోకి వెళ్లే మార్గాలను విస్తరించలేదు. రెండుసార్లు బీటీ వేయాల్సి ఉండగా ఒకేసారి వేశారు. వీధిదీపాలు ఏర్పాటు చేయలేదు. అసంపూర్తి పనులు.. ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైల్వేగేటును మూసివేయడంతో అక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్లంతా ఒక రోజు రిలే దీక్షకు దిగారు. రైల్వేశాఖతో మాట్లాడి పనులు పూర్తయ్యేంత వరకు గేటు తెరిచేలా చర్యలు తీసుకుంటామని స్థానిక ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వడంతో వ్యాపారులు ఆందోళన విరమించారు. రైల్వేగేటు యథాతథంగా పనిచేయకపోతే ఆందోళనబాట పడతామని వారు హెచ్చిరిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details