తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగుతూ సాగుతున్న ఉదండాపూర్‌ జలాశయం పనులు - Mahabubnagar District Latest News

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథంకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్​ జలాశయ పనులు ఆగుతూ సాగుతున్నాయి. జలాశయానికి అవసరమైన భూ సేకరణ పూర్తికాలేదు. సేకరించిన భూమికి పరిహారం అందలేదు. నిర్వాసిత గ్రామాల్లో సామాజిక సర్వే జరిగితే దాన్ని బట్టి ప్రభుత్వం మిగిలిన పరిహారం చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు.

Delay in Udandapur reservoir works
Delay in Udandapur reservoir works

By

Published : Nov 27, 2020, 12:48 PM IST

ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. క్షేత్రస్థాయిలో మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్‌ జలాశయం పనులు ఆరంభ శూరత్వంగా మారాయి. మొదట్లో హడావుడి చేసిన అధికారులు తరవాత నిర్లక్ష్యం చేస్తున్నారు. ముందుగా జలాశయం కోసం పలువురు రైతులు భూములు ఇవ్వడానికి అంగీకారం తెలిపారు.

అనంతరం జరిగిన పరిణామాలు, పరిహారం చెల్లింపులో జాప్యం, మంత్రులు, కలెక్టర్‌ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం.. తదితర కారణాలతో ఇప్పుడు పరిహారం విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని రైతులు, ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగారు. దీనికి తోడు ఈ ఏడాది మార్చి నెల నుంచి కరోన వైరస్‌ ప్రభావంతో కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయి.. పనులు నెమ్మదించాయి. కట్ట నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి.

పరిహారం సరిపోదని ఆందోళన :

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూత్పూర్‌ దగ్గర 2015 జూన్‌ 11న పైలాన్‌ను ఆవిష్కరించారు. 2017లో ఉదండాపూర్‌ జలాశయ నిర్మాణానికి భూసేకరణ కోసం ప్రభుత్వం ప్రకటన చేసింది. అప్పట్లో భూములకు ప్రకటించిన పరిహారం చాలా తక్కువగా ఉందని, తాము తీవ్రంగా నష్టపోయామని పలువురు రైతులు ఆందోళనకు దిగుతున్నారు. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఆ పరిహారంతో ఇప్పుడు కనీసం ఇంటి స్థలం కూడా కొనుక్కోలేమని పేర్కొంటున్నారు. గతంలో మంత్రి హోదాలో డా.లక్ష్మారెడ్డి, ప్రస్తుత మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నిర్వాసితులకు మరోచోట ఇళ్ల స్థలాలు ఇస్తామని, రెండు పడకగదుల ఇళ్లు ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో ముంపు గ్రామాల్లో సామాజిక ఆర్థిక గణన సర్వేను నిర్వాసితులు అడ్డుకున్నారు. దీంతో జలాశయానికి అవసరమైన భూ సేకరణ పూర్తికాలేదు. సేకరించిన భూమికి పరిహారం అందలేదు.

భూ సేకరణ వివరాలు (ఎకరాల్లో) ఇలా..

  • జలాశయ నిర్మాణానికి అవసరమైన భూమి 4,229
  • ఇప్పటి వరకు సేకరించింది 3567
  • ఇంకా సేకరించాల్సింది 662
  • నిర్వాసిత గ్రామాలు వల్లూరు, ఉదండాపూర్‌, 8 తండాలు

పనుల్లో వేగం పెంచుతాం..:

నిర్వాసితుల ఆందోళనలు, కొందరు రైతులు అంగీకారం తెలపకపోవడంతో భూసేకరణలో జాప్యం జరిగింది. తరవాత కరోనా ప్రభావంతో ఇతర రాష్ట్రాల కార్మికులు వెళ్లిపోవడంతో పనులు మందగించాయి. గుత్తేదార్లతో పనుల్లో వేగం పెంచుతాం. నిర్వాసితులకు ఇతర చోట ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదించాం. దానికి రూ.10 కోట్లు అవసరం ఉంది. నిర్వాసిత గ్రామాల్లో సామాజిక సర్వే జరిగితే దాన్ని బట్టి ప్రభుత్వం మిగిలిన పరిహారం చెల్లిస్తుంది.- ఉదయ్‌శంకర్‌, పీఎల్‌ఐ ఈఈ

ఇదీ చూడండి:జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచిన కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details