తెలంగాణ

telangana

ETV Bharat / state

Pattadar Pass Books : పత్తాలేని పాసుపుస్తకాలు.. సకాలంలో అందక రైతుల అవస్థలు - joint Mahbubnagar District latest news

Delay in Pattadar Pass Books : ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, భాగ పరిష్కారాలు, విరాసత్ ఇతర లావాదేవీల ద్వారా.. పాసుపుస్తకాలు పొందాల్సిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ధరణి లావాదేవీల తర్వాత కొత్త పాసుపుస్తకాలు రావాల్సి ఉన్నా మూడునెలలుగా అందట్లేదు. ధరణి రుసుముల్లో రూ.300 అందుకోసం ఫీజుగా వసూలు చేస్తున్నా అన్నదాత చేతికి చేరడం లేదు. అవి ఎప్పుడు అందుతాయి, ఎలా అందుతాయన్న ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాసుపుస్తకాలు అందని రైతుల ఇబ్బందులపై కథనం.

Pattadaru pass books
Pattadaru pass books

By

Published : Jun 29, 2023, 10:51 AM IST

సకాలంలో పాసుపుస్తకాలు అందక రైతుల అవస్థలు

Pattadar Pass Books delay in telangana :ధరణి పోర్టల్‌లో కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి.. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారికి మూడునెలలుగా పాసుపుస్తకాలు అందడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిత్యం సగటున.. 430 నుంచి 510 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మూడు నెలల్లో ఉమ్మడి జిల్లాలో 33,000 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అధికారులు రిజిస్ట్రేషన్‌ చేసేటప్పుడు పాసుపుస్తకాల కోసం రూ.300 అదనంగా వసూలు చేస్తారు.

నిబంధనల ప్రకారం భూమిని కొనుగోలు చేసిన రైతుకు.. నెలరోజుల్లో ఇంటికి పోస్ట్‌ ద్వారా పాసుపుస్తకంరావాలి. అలా వచ్చిన పాసుపుస్తకంతో వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్లి రైతుబంధు, రైతుబీమా సహా.. పలు ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. మూడునెలలుగా పట్టా పాసుపుస్తకాలు అందక అన్నదాతలు ఆ లబ్ధి కోల్పోతున్నారు. కేవలం కొత్త రిజిస్ట్రేషన్‌లు మాత్రమే కాదు గతంలో పార్ట్-బీలో ఉన్న వివాదాలు పరిష్కారమైన భూములు, విరాసత్ చేసుకున్నవి, భాగ పరిష్కారాలు, డిజిటల్ సంతకాలు పూర్తైన భూములు ఇలా వివిధ రకాల భూములకు పాసుపుస్తకాలు రావడం లేదు.

Difficulties of Farmers Delay in Pass Books : పట్టా పాసుపుస్తకాల కోసం రైతులు తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు సీసీఎల్​ఏ నుంచి వస్తాయని సర్దిచెప్పి పంపిస్తున్నా సమస్య పరిష్కారం కావటం లేదు. అత్యవసరం ఉన్న కొందరు అన్నదాతలు.. మీసేవా కేంద్రంలో రూ.300 పెట్టి డూప్లికేట్‌ పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకుంటున్నా అవి అందక కర్షకులు ఆవేదనకు గురవుతున్నారు.

వానాకాలం పంటల సాగు ప్రారంభమవుతున్నందున పాసుపుస్తకాలు రాకపోవటంతో కొత్తగా కొనుగోలు చేసిన భూమిపై.. బ్యాంకులు పంటరుణాలు, యంత్రాల కొనుగోలు రుణాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ధరణిలో రిజిస్ట్రేషన్‌ చేసిన పాసుపుస్తకాలు ముద్రించి పంపే బాధ్యత తీసుకున్న ఏజెన్సీ పాతబిల్లులు రాకపోవడంతో కొత్తవి పంపించట్లేదన్న ప్రచారం సాగుతోంది. దీంతో రైతులు రోజూ వస్తుండటంతో ఏం చెప్పాలో రెవెన్యూ అధికారులకు అర్థం కావటం లేదు.

  • Problems with Dharani Website : అన్నదాతలను అరిగోస పెడుతున్న 'ధరణి లోపాలు'

"పాసుపుస్తకాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రైతుబంధు, రైతుబీమా వంటి ఫథకాలకు దరఖాస్తు చేసుకులేకపోతున్నాం. పాసుపుస్తకాలు రాకపోవటంతో కొత్తగా కొనుగోలు చేసిన భూమిపై.. బ్యాంకులు పంటరుణాలు, యంత్రాల కొనుగోలు రుణాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి పాసుపుస్తకాలు త్వరగా ఇవ్వాలని కోరుతున్నాం." - రైతులు

Delay in Pattadar Pass Books :సమస్య పరిష్కారంపై ఏ అధికారిని సంప్రదించినా సరైన సమాధానం రావడం లేదు. పాసుపుస్తకాలు అందనివారు అత్యవసరమై భూములు అమ్ముకుందామన్నా ఆ అవకాశం లేకుండా పోతోంది. అధికారులు ఈ-పాస్ పుస్తకంతో రైతుబంధు, కిసాన్ సమ్మాన్ నిధి సహా అన్నిలావాదేవీలు చేసుకోవచ్చని రైతులకు సూచిస్తున్నారు. ఇప్పటికైనా కొత్త పాస్‌పుస్తకాల జారీపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details