రాష్ట్రవ్యాప్తంగా రైతులను సంఘటితం చేయటమే లక్ష్యంగా.. ప్రభుత్వం చేపట్టిన రైతువేదికల నిర్మాణాలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదు. దసరా నాటికి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించాలని భావించినా.. ఈ వేదికల నిర్మాణాల్లో జాప్యం కొనసాగుతోంది. ఒక్క వనపర్తి జిల్లాలో 71 నిర్మాణాలకు... ఇప్పటి వరకూ 66 పూర్తికాగా... మరో రెండు మూడ్రోజుల్లోనే మిగతావి పూర్తయ్యే అవకాశముంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 97 వేదికలకు గాను.. ఇప్పటి వరకూ 77 పూర్తి చేశారు. మరో 20 అసంపూర్తిగా మిగిలాయి. 10 చోట్ల పైకప్పు పూర్తయి చివరి దశ పనులు మిగులగా.. 8 వేదికల్లో పైకప్పు వేస్తున్నారు. 2 వేదికలు లెంటల్ లెవల్ లో ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో పనులు నత్త నడకన సాగుతున్నాయి. 77 రైతు వేదికలకు గాను ఇప్పటికి 16 మాత్రమే పూర్తిచేశారు. మిగిలిన 61 వివిధ దశల్లో ఉన్నాయి.
ప్రధాన ఆటంకంగా భారీ వర్షాలు
ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలు రైతు వేదికల నిర్మాణానికి ప్రధాన ఆటంకంగా నిలిచాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకూ నెలలో కనీసంగా 10 రోజుల పాటు వర్షాలు కురిశాయి. దీంతో పనులు ముందుకు సాగలేదు. ఇసుక అందుబాటులో లేకపోవటం వల్ల.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ పనులు మందకొడిగా సాగాయి. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో సమీప వాగుల్లోంచి ఇసుకను తరలించుకునేందుకు అనుమతులు మంజూరు చేయడం వల్ల ఇసుక సమస్య తీరింది. దసరా గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేకాధికారులను రంగంలోకి దింపి క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించారు. అదనపు మానవ వనరులు, యంత్రాలు వినియోగించుకోవాలని కోరారు.