Crops drying with power cuts: వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ అందించాలంటూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులు చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. వనపర్తి జిల్లా పానగల్ మండల కేతేపల్లి, కొత్తకోట, జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ముచ్చోనిపల్లి సబ్ స్టేషన్, నారాయణపేట జిల్లా కేంద్రం, నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ, కల్వకుర్తి సహా పలు సబ్ స్టేషన్లను రైతులు ముట్టడించారు.
పలుచోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. రైతులకు 24గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రభుత్వం ఆర్బాటం చేస్తున్నా... మూడు నాలుగు గంటలు కూడా త్రీఫేజ్ కరెంటు అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా పంటలకు నీళ్లు పారక ఎండిపోయే పరిస్థితి ఎదురైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.యాసంగిలో ప్రాజెక్టులు, బోరుబావుల కిందైనా ఆరుతడి పంటలే సాగు చేయాలని వ్యవసాయశాఖ సూచించింది.
కానీ వానలు విస్తారంగా కురిసి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు జిల్లాల్లోనూ భూగర్భ జలాలు ఆశాజనకంగా పెరిగాయి. దీంతో నీటి వనరులు అధికంగా అవసరమైన వరిలాంటి పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో త్రీఫేజ్ కరెంటు సరఫరా క్రమంగా తగ్గుతూ వచ్చింది. కొన్నిచోట్ల 3 గంటలకే పరిమితం చేశారు. దీంతో వరి, మొక్కజొన్న, వేరుశనగ, మిరప, కూరగాయలు సహా మామిడి, బత్తాయి, అంజీర లాంటి తోటలకు నీరందడం గగనమైంది.