Digital Crop Survey in Telangana : తెలంగాణలో వ్యవసాయశాఖ చేపడుతున్న పంటల నమోదు ప్రక్రియ తరహాలోనే దేశవ్యాప్తంగా డిజిటల్‌గా పంటల సర్వే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా ఈ ఖరీఫ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ముందుగా 12రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ పంటల సర్వేను చేపట్టనున్నారు. సర్వే చేసేందుకు రూపొందించిన యాప్ పనితీరును పరీక్షించేందుకు ప్రూఫ్ అఫ్ కాన్సెప్ట్ - పీఓసీ కింద 12రాష్ట్రాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. తెలంగాణలో మహబూబ్‌నగర్ జిల్లా వెంకటాపూర్ గ్రామం పీఓసీకి ఎంపికైంది.
Crop Survey based on Tracking System in Telangana : ఈ మేరకు నలుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం గ్రామంలో స్థానిక వ్యవసాయ అధికారులతో కలిసి నమూనా సర్వే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ అప్లికేషన్‌లో నేరుగా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిఅక్కడ ఏ పంట వేశారో ఫోటో తీసి సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు భూరికార్డుల నుంచి ఏ సర్వే నంబర్‌లో, ఏ రైతుకెంత భూమి ఉంది.. అది ఎక్కడుందన్న సమాచారాన్ని జీపీఎస్ ట్రాకింగ్ సిస్టింతో అనుసంధానం చేశారు. పంటల సర్వే పక్కాగా జరగాలన్నదే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని బృంద సభ్యులు చెబుతున్నారు.
venkatapur digital crop survey in Mahabubnagar : 12రాష్ట్రాల్లో ఒక్కో గ్రామంలో పీఓసీ కింద యాప్ పనితీరును పరీక్షించిన తర్వాత అవసరమైన మార్పులు, చేర్పులు చేసి ఈ ఖరీఫ్ సీజన్‌లో 12రాష్ట్రాల్లోని 20శాతం గ్రామాల్లో ప్రయోగాత్మకంగా పంటల సర్వే అమలు చేయనున్నారు. తెలంగాణ సహా 4రాష్ట్రాల్లో ఇప్పటికే పంటల నమోదు ప్రక్రియ అమల్లో ఉంది. అందుకోసం రాష్ట్రప్రభుత్వాలకు ప్రత్యేకంగా యాప్‌లున్నాయి. కేంద్రం నిర్వహించే పంటల సర్వేకు రాష్ట్రాల యాప్‌లో మార్పులు చేసుకుని వాడుకోవచ్చని, లేదంటే కేంద్రం రూపొందించిన యాప్‌ని నేరుగా వాడుకోవచ్చని కేంద్ర వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పంటల నష్టం, బీమా, రాయితీపై ఎరువులు, పంట సేకరణ లాంటి పక్రియల్లో నేరుగా రైతుకు లబ్ది చేకూర్చేందుకు సర్వే సమాచారం తోడ్పడుతుందంటున్నారు.