తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరు జిల్లాలో రైతులను నట్టేట ముంచిన వర్షాలు - Crop Damage Details

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో కురిసిన అధిక వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. 5 జిల్లాల వ్యాప్తంగా సుమారు లక్షా 80వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అందులో అత్యధికంగా నష్టపోయింది పత్తి రైతులే. అధిక వర్షాలకు చేలల్లో నీళ్లు నిలిచి, పంట ఎర్రబారి, కాయలు నల్లబారి, కొన్నిచోట్ల గింజ మొలకలొచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వానల కారణంగా వరికి తెగుళ్ల బెడద అధికమై ఈసారి దిగుబడులపై తీవ్ర ప్రభావం పడనుందని రైతుల ఆందోళనలో ఉన్నారు. కంది, జొన్న, మొక్కజొన్న, మిర్చి సహా కూరగాయల పంటలు స్వల్ఫంగా తిన్నాయి. నష్టపోయిన రైతుల్నిఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

Crop damage with heavy rains In Mahabubnagar district
పాలమూరు జిల్లాలో రైతులను నట్టేట ముంచిన వర్షాలు

By

Published : Oct 16, 2020, 11:45 AM IST

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో జూన్ మొదలుకొని సెప్టెంబర్ వరకూ కురిసిన అధిక వర్షాలు, ప్రస్తుతం అక్టోబర్​లో కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఇవాళ్టి వరకూ లక్షా 80వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

మరింత నష్టం

ఈ నష్టం రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే అధికంగా నష్టపోయింది పత్తి రైతులే. ఐదు జిల్లాలో ఈ వానాకాలంలో పత్తి 9 లక్షల 94 వేల ఎకరాల్లో సాగైంది. అధిక వర్షాలకు పొలాల్లో నీరు నిలిచి మొక్కలు ఎరుపు రంగుకు మారాయి. కాయ నల్లగా మారి.. కొన్నిచోట్ల పత్తి గింజలు మొలకలొచ్చాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లాలో 64వేల ఎకరాల్లో పత్తి దెబ్బతింది. మహబూబ్​నగర్ జిల్లాలో సుమారు 20వేలు, నారాయణపేట జిల్లాలో 25వేలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 16వేల500, వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 594 ఎకరాల్లోనే నష్టపోయినట్లుగా అంచనా వేశారు. రైతులు మాత్రం ఎకరాకు ఈసారి రెండు,మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా రాదని, పెట్టిన పెట్టుబడులు, శ్రమంతా నీళ్ల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళనలో రైతులు

పత్తి రైతుల తర్వాత అత్యధికంగా నష్టపోయింది వరి రైతులు. వానలకు నీళ్లు చేరి చాలా చోట్ల వరి ఒరిగిపోయింది. ప్రస్తుతం పాలుపోసుకునే దశలో, కంకి దశలో ఉన్న వరికి చీడపీడల బెడద అధికమైంది. అగ్గితెగులు, కాండం తొలిచే పురుగు, కంకినల్లి, కంపునల్లి సహా మానుపండు తెగులు వరి రైతుల్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రస్తుతం సోకిన చీడపీడల కారణంగా వరి రైతులకు ఆశించిన దిగుబడి వచ్చేలా కనిపించడం లేదు. దాదాపు ఐదు జిల్లాలోనూ సగటున 2వేల ఎకరాల నుంచి 3వేల ఎకరాల వరకూ వరి రైతులు నష్టపోయారు. ఇలాగే వర్షాలు కొనసాగితే వరి దక్కదనే ఆందోళన రైతులను వెంటాడుతోంది.

ఆదుకోండి సారూ...

ఇక కందిలో తెగుళ్ల బెడద అధికమైంది. ఇవికాకుండా జొన్న, మొక్కజొన్న, ఆముదం పంటలు స్వల్ఫంగా నష్టపోయాయి. ఇక ఉద్యాన పంటల్లో కూరగాయలు, మిర్చికి అధిక నష్టం ఉంది. పొలాల్లో నీరు నిలిచిన కారణంగా కూరగాయల్లో పూత రాలడం సహా చీడపీడల బెడద అధికంగా ఉంది. కూరగాయల రైతుల నష్టాన్ని సైతం అంచనా వేసి ఆదుకోవాలని ఉద్యాన రైతులు కోరుతున్నారు.

ఈ వానాకాలం సీజన్ లో 5 జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతానికి మించి 100 నుంచి 120శాతం వరకూ వర్షపాతం అధికంగా నమోదైంది. ప్రతి నెలలో సగటున 15 రోజులు వర్షాలు కురిశాయి. ఇదే పంటలకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. అన్నిపంటల్లోనూ తెగుళ్ల బెడద అధికం కాగా నేల తడారకపోవడంతో పంట నష్టం అధికంగా ఉంది. వర్షాలు ఇలాగే కొనసాగితే అన్నిపంటలకూ చేటు తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:భాగ్యనగరంలో పేదల బతుకుల్ని చిదిమేసిన వర్షం

ABOUT THE AUTHOR

...view details