పత్తిపై అధిక వర్షాల ప్రభావం... సగానికి పైగా పడిపోయిన దిగుబడి Cotton Crop Yield reduced due to Heavy Rains: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈసారి పత్తిపంట విస్తృతంగా సాగైంది. సాధారణ సాగువిస్తీర్ణం 7లక్షల80వేల ఎకరాలు కాగా ఈ వానాకాలంలో 9లక్షల ఎకరాల్లో రైతులు సాగుచేశారు. గతేడాది పత్తి క్వింటా 10వేలవరకూ ధర పలకడంతో పత్తిసాగు గణనీయంగా పెరిగింది. బహిరంగమార్కెట్లు, పత్తిమార్కెట్లకు పత్తిరాక మొదలైంది. కనీసమద్దతుధర క్వింటా 6వేలకు పైగా ఉండగా, నాణ్యమైన పత్తికి బహిరంగ మార్కెట్లలో క్వింటా 7వేల నుంచి 9వేలు పలుకుతోంది.
ప్రస్తుతం దళారులు, వ్యాపారులు, జిన్నింగ్ మిల్లులు, మార్కెట్లలో ఇచ్చేధర తమకు గిట్టుబాటు కాదంటున్నారు పాలమూరు జిల్లా రైతులు. అందుకే నాణ్యమైన పత్తిని ఇళ్లలోనే నిల్వచేసుకుంటున్నారు. మంచిధర వచ్చినప్పుడు అమ్ముకుందామనే ప్రణాళికతో ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి పత్తి మార్కెట్‌కు ఈ సమయానికి విస్తృతంగా పత్తి రావాలి. ప్రస్తుతం తెల్లబంగారం కనిపించక మార్కెట్ వెలవెలబోతోంది. జిన్నింగ్ మిల్లులు, ప్రైవేటు వ్యాపారుల కొనుగోళ్లు సైతం నామమాత్రంగానే సాగుతున్నాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ పరిస్థితికి కారణం పత్తి దిగుబడులు దారుణంగా పడిపోవడమే. అధిక వర్షాలకు పత్తిపంట చాలాచోట్ల దెబ్బతింది. పూత, కాత రాలి,తెగుళ్లు సోకి దిగుబడులు సగానికిపైగా పడిపోయాయి. పంటల్ని కాపాడుకునేందుకు కలుపుతీత, ఎరువులు, పురుగుమందులకు పెట్టుబడులు భారీగా పెట్టారు. దిగుబడులు తగ్గడం వల్ల క్వింటాకు 8వేలు పలికినా గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లకు, జిన్నింగ్ మిల్లులకు ప్రస్తుతం నాణ్యతలేని నల్లబారిన పత్తిని రైతులు అమ్ముతున్నారు. 10 నుంచి ఆ పైన ఎక్కువ ఎకరాల్లో పత్తి సాగుచేసిన రైతులు అధిక ధర కోసం రాయచూరు, కర్ణాటక మార్కెట్లకు పత్తి తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఐదెకరాలలోపు తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు మాత్రం స్థానిక మార్కెట్లలోనే పంటను విక్రయిస్తున్నారు. పేరుకు కనీస మద్దతు ధర మించి ధర పలుకుతోందని, పెట్టుబడులు, ఖర్చులు, శ్రమ పోను ఏం మిగలడం లేదన్నది రైతుల వాదన. పత్తి రైతులు లాభపడాలంటే పరిహారంతో పాటు క్వింటా 10 నుంచి 12వేల వరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: