Cotton Farmers Problems Due To No Rains : జూన్ మొదలై పక్షం రోజులు గడుస్తున్నా, తగ్గని అధిక ఉష్ణోగ్రతలు విత్తన పత్తి, సాధారణ పత్తి సాగుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటికే సాగుచేసిన పత్తి పంటలను రైతులు ఎక్కడికక్కడ పెరికి వేస్తున్నారు. వేసిన పంట ఎండలకు ఎండిపోవడం, ఎర్రబారడం, ఎదుగుదల లేకపోవడం అందుకు ప్రధాన కారణం. జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో విత్తన పత్తిని సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గద్వాల మల్దకల్, దరూరు కేటిదొడ్డి, గట్టు మండలాల్లో విత్తన పత్తి సాగు అధికంగా ఉంటుంది. ఆర్గనైజర్లు ఇచ్చే విత్తనాలను ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో బోరు బావుల మీద ఆధారపడి సాగు చేస్తారు. వర్షాలు కురిసే నాటికి పంట ఎదిగి ఏపుగా పెరుగుతుంది. కానీ ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో మొక్కలు ఎర్రబారి పోతున్నాయి. ఎదుగుదల కూడా మందగించింది. దీంతో వేసిన పంట పనికి రాదని దిగుబడి సైతం ఆశించిన మేర ఉండదని భావించి రైతులు వేసిన పంటను పెరికి వేసి మరోసారి విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.
Cotton Farmers Problems Due To High Temperatures : ఏప్రిల్, మే నెలలో సాగు చేసిన పత్తికి ఎకరాకు రూ.30 నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడులు పెట్టామని.. 15 రోజుల నుంచి 40 రోజుల వరకు పంట కాలాన్ని కూడా నష్టపోవాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి నష్టపోగా.. మళ్లీ అదే స్థాయిలో తిరిగి అప్పులు చేసి పంట సాగు చేయాల్సి వస్తుందంటున్నారు. ఇప్పటికే దాదాపు 30 వేల ఎకరాల్లో విత్తనపత్తి పంటలను రైతు నష్టపోవాల్సి వస్తుంది అని అంచనా.