ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలు పత్తి రైతును చిత్తుచేస్తున్నాయి. జూన్ నుంచి అక్టోబర్ 15 నాటికి సగటున నెలకు 12 రోజుల పాటు కురిసిన వర్షాలు.. పత్తి పంటకు తీవ్ర నష్టాన్నే మిగిల్చాయి. కుండపోత వానలు, వరదల కారణంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోని పత్తి చేలలో నీరు నిలిచి పంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. కోత దశలో ఉన్న పత్తి వానలకు తడిసి.. గింజలు మొలకెత్తాయి. పగిలిన కాయల్లో పత్తి నల్లబారింది. నీరు నిలిచిన చేలల్లో కాయలు మురిగిపోయాయి. సరైన పోషకాలు అందక పంట ఎర్రబారింది. తెరపి లేకుండా కురుస్తున్న వానలు పత్తి పంటను కోలులోలేని దెబ్బతీస్తున్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే ప్రస్తుతం పత్తి పంట ఏ దశలో ఉన్నా సాగు చేసిన రైతులకు మాత్రం నష్టం తప్పేలా లేదు. కాస్త తెరపినిస్తే పంట కోలుకుంటుందన్న ఆశలు తాజా వానలతో ఆవిరై పోతున్నాయి. మొత్తంగా ఈ వానాకాలం పత్తి సాగు చేసిన రైతుకు పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదని అన్నదాతలు తీరని ఆవేదనలో ఉన్నారు.
12 ఎకరాలు పత్తి నాటాను. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాను. ఆదాయం ఎక్కువ వస్తుందని పత్తిని సాగు చేశాను. పంట చేతికందే సమయానికి నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి రాలిపోతోంది. మొక్కపైనే గింజ మొలకెత్తుతోంది. నల్ల బారింది. ఇలాంటి పత్తిని ఎవరూ కొనే పరిస్థితి కూడా లేదు. దిగుబడి 2 నుంచి 3 క్వింటాళ్లు వస్తే అదే మహా ఎక్కువ. పత్తి సేకరిద్దామనుకున్నా... వర్షం సహకరించడం లేదు. వానలకు కూలీలు రావడం లేదు. పత్తి తెంపినా.. వచ్చే డబ్బు కూలీలకే సరిపోదు. పెట్టుబడులూ చేతికి రాని దుస్థితి ఉంది.
- పాండురంగారెడ్డి, ఇప్పలపల్లి, తిమ్మాజి పేట మండలం
చేతికందుతున్న సమయానికే
మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 9లక్షల 94వేల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే లక్షా 79 వేల ఎకరాల్లో అధికంగా సాగైంది. నియంత్రిత వ్యవసాయంలో భాగంగా ప్రభుత్వం పత్తిని అధికంగా సాగు చేయాలని చెప్పడంతో ఎక్కువ మంది పత్తి వైపు మొగ్గుచూపారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యాజమాన్యం కోసం కనిష్ఠంగా ఎకరాకు 20వేల వరకూ ఖర్చు చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన వానలు చూసి పత్తి ఈ ఏడాది బాగా కలిసి వస్తుందని ఆనంద పడ్డారు. ఆ ఆనందం రైతుల్లో ఎంతో కాలం నిలవ లేదు. సరిగ్గా పంట చేతికందుతుందనుకునే సమయానికి వానలు కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రస్తుతం పంట ఏ దశలో ఉన్నా.. ఆశించిన దిగుబడి వచ్చే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. పెట్టుబడులు కూడా చేతికి రాక రైతులు నష్టపోనున్నారు.
ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టాను. సాగు చేసిన పత్తి మొత్తం నష్టపోయాను. సాధారణంగా ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాలి. కానీ ఈ ఏడాది రెండు, మూడు క్వింటాళ్లు రావడమే ఎక్కువ. వచ్చే పత్తి నాణ్యంగా లేదు. ఆ పత్తికి రూ.2 నుంచి 4 వేల వరకే ధర పలుకుతుంది. నాణ్యంగా ఉంటేనే ప్రభుత్వ సంస్థలు కొంటాయి. ప్రైవేటులో మంచి ధర ఇవ్వరు. ఈ ఏడాది పత్తి సాగు నష్టమే. ప్రభుత్వమే రైతుల గురించి ఆలోచించాలి. ఆదుకోవాలి.
-హనుమంతు నాయక్, హనుమాన్ తండా
అప్పులే మిగిలాయి
అన్ని కలిసి వస్తే పత్తిలో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం కనిష్ఠంగా క్వింటా.. గరిష్ఠంగా 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. చేతికందే పత్తి కూడా నాణ్యంగా ఉండే పరిస్థితి లేదు. నాణ్యంగా లేని పత్తిని సీసీఐ కొనుగోలు చేయదు. నాణ్యత లేని పత్తి గరిష్ఠంగా క్వింటాకు రూ. 3 వేలు, రూ.3 వేల 50 మాత్రమే పలుకుతుంది. ఈ ధరకు అమ్మినా వచ్చే ఆదాయం పెట్టుబడులకు కూడా సరిపోదని రైతులు వాపోతున్నారు. వర్షాలకు పత్తి సేకరణకు కూలీలు రావడం లేదు. వచ్చినా ఒక్కొక్కరికి రోజుకు 500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పత్తి సేకరించినా లాభం లేదనుకుంటున్న రైతులు చేలల్లో అలాగే వదిలేస్తున్నారు. ఈ ఏడాది పెట్టుబడులూ చేతికి రాక అప్పులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతుల బాధలు వర్ణణాతీతం. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు, ఎకరాకు కనిష్ఠంగా రూ.8వేల చొప్పున కౌలు మొత్తం భారం మీద పడటంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఎలాగైనా ప్రభుత్వమే తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
తిమ్మాజీ పేట మండలంలో 27వేల ఎకరాల్లో పత్తి సాగైంది. గత ఏడాది కంటే అధికంగా సాగైంది. ఎడ తెరపి లేని వానల వల్ల చాలాచోట్ల పత్తి తడిసి గింజలు మొలకలొచ్చాయి. రైతులకు వర్షాల వల్ల రెండు రకాల నష్టం ఉంది. సాధారణంగా పత్తిలో 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇప్పుడు మూడు, నాలుగు క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశమే ఉంది. పత్తి నల్లబారి, మొలకలు వచ్చి నాణ్యత తగ్గిపోతోంది. దీనివల్ల మద్దతు ధర రాకపోవచ్చు. పత్తి నష్టాన్ని అంచనా వేసి.. ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నాం.