తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా చీకట్ల నడుమ.. మేడే వెలుగు - corona effect on Mayday celebrations at mahabubnagar

కరోనా కారణంగా దేశంలో గత నలభై రోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌను కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న దాదాపు 20 లక్షల కార్మికులంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఏటా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఘనంగా నిర్వహించుకునే ‘మే డే’ ఉత్సవాలకు ఈ ఏడాది పలువురు కార్మికులు దూరం అవుతున్నారు.

corona effect on Mayday celebrations at mahabubnagar
corona effect on Mayday celebrations at mahabubnagar

By

Published : May 1, 2020, 10:14 AM IST

ఇతర రాష్ట్రాల నుంచి పాలమూరు జిల్లాలకు వచ్చి లాక్‌డౌను కారణంగా ఇక్కడ చిక్కుకుపోయిన మరో 22,266 మంది కార్మికులు శిబిరాలకే పరిమితం అయ్యారు. ఇదేవిధంగా పరాయి రాష్ట్రాల్లో పాలమూరు కార్మికులు మరో 10 వేల మంది చిక్కుకొని ఉంటారు. ప్రధానంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల, రాజాపూర్‌, బాలానగర్‌ మండలాల పరిధిలోని పలు పరిశ్రమల్లో పెద్దఎత్తున కార్మికులు పనిచేస్తున్నారు. వీరి పరిస్థితి ప్రస్తుతం మరీ అధ్వానంగా మారింది.

ప్రభుత్వం రూ.500 నగదుతోపాటు ఒక్కొక్కరికి ఇచ్చిన 12 కిలోల బియ్యంతో ప్రస్తుతానికి నెట్టుకొస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, బెంగాల్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వీరంతా తమ స్వస్థలాలకు వెళ్లాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటివారి ఆవేదన విన్న కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లవచ్చని మార్గదర్శకాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికిప్పుడు సుమారు 15 వేల వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకోవైపు ఉమ్మడి పాలమూరుకు చెందిన కార్మికులు మహారాష్ట్రలోని ముంబయి, పుణె నగరాల్లో తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీరిలో 60 శాతం పేట జిల్లాకు చెందినవారే.

జాబితా తయారు చేస్తున్నాం...

ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల జాబితాను గతంలోనే తయారు చేశామని మహబూబ్‌నగర్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ నీలమ్మ తెలిపారు. వారికి రూ.500 నగదుతోపాటు బియ్యం పంపిణీ చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న కార్మికుల జాబితాను తయారు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటివారు స్థానిక తహసీల్దారు వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్కడి నుంచి కార్మికశాఖకు దస్త్రం వస్తుందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తరలింపు ఉంటుందన్నారు.

For All Latest Updates

TAGGED:

eenadu

ABOUT THE AUTHOR

...view details