తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వేదికల నిర్మాణాలు.. దసరా నాటికి పూర్తయ్యేనా - మహబూబ్ నగర్ జిల్లాలో సాగుతోన్న రైతు వేదికల నిర్మాణాలు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. స్థల వివాదాలు, భారీ వర్షాలు, కూలీలు, ఇసుక కొరత వంటి సమస్యలతో నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడం సహా నిధుల లేమితో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొన్ని చోట్ల నిర్మాణాలు జోరందుకున్నా.. చాలా చోట్ల నెమ్మదించాయి. దసరా నాటికి రైతు వేదికలను పూర్తి చేయాలనే సర్కారు ఆకాంక్ష నెరవేరేలా కనిపించడం లేదు.

రైతు వేదికల నిర్మాణాలు.. దసరా నాటికి పూర్తయ్యేనా
రైతు వేదికల నిర్మాణాలు.. దసరా నాటికి పూర్తయ్యేనా

By

Published : Sep 15, 2020, 4:56 AM IST

రైతు వేదికల నిర్మాణాలు.. దసరా నాటికి పూర్తయ్యేనా

ఉమ్మడి పాలమూరు జిల్లాలో దసరా నాటికి అన్ని వ్యవసాయ క్లసర్లలో రైతు వేదికల్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించినా... క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. నిర్మాణాలు పూర్తయ్యేందుకు మరో రెండు, మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 88, జోగులాంబ గద్వాల జిల్లాలో 97, నాగర్‌కర్నూల్ జిల్లాలో 143, నారాయణపేట జిల్లాలో 77, వనపర్తి జిల్లాలో 71... మొత్తం 476 రైతు వేదికల్ని నిర్మిస్తున్నారు.

దసరా నాటికి..

వీటికోసం రూ. 104 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ నుంచి రూ. 12 లక్షలు, ఉపాధి హామీ నిధుల నుంచి రూ. 10 లక్షలు వెచ్చించి.. సగటున రూ. 22 లక్షలతో ఒక్కొ రైతువేదిక నిర్మిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం కొన్ని పునాదుల దశలోనే ఉంటే.. మిగిలిన వాటిని దసరా నాటికి పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

అడ్డంకిగా వర్షాలు..

తొలుత మూడు నెలల్లో రైతు వేదికల నిర్మాణాల్ని పూర్తి చేయాలని సర్కారు భావించింది. ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలు పనులకు అడ్డంకిగా మారాయి. కూలీల కొరత ఏర్పడడం వల్ల ఆగస్టులో పనులు నామమాత్రంగానే సాగాయి. ఈనెలలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టగా అన్ని జిల్లాల్లో పనులు ఊపందుకున్నాయి. చాలాచోట్ల కావాల్సిన స్థలం అందుబాటులో లేకపోవడం జాప్యానికి కారణమైంది.

ఇసుక కొరత..

ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో స్థలాల కేటాయింపులు పూర్తయినా... ఇసుక కొరత వల్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం పునాదులు, పిల్లర్ల దశలో ఉన్న నిర్మాణాలు పూర్తి కావాలంటే.. మరో రెండు, మూడు నెలలు తప్పదని రైతుబంధు సమితి సభ్యులు చెబుతున్నారు.

కలెక్టర్ తనిఖీ..

నాగర్‌కర్నూల్ జిల్లాలో 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌గా.. మొత్తం 143 రైతు వేదికలను ప్రభుత్వ భూముల్లోనే నిర్మిస్తున్నారు. అన్నదాతలకు డిజిటలైజేషన్, దృశ్య శ్రావణ మాధ్యమాల ద్వారా అర్థమయ్యేలా చెప్పేందుకు అన్ని హంగులతో నిర్మిస్తున్నారు. కలెక్టర్ ఎల్. శర్మన్ చౌహన్ ఆకస్మిక తనిఖీల ద్వారా పనులను పర్యవేక్షిస్తున్నారు. దసరా లోపు గడువు ఉండడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి.

నాణ్యతలో రాజీ లేకుండా సకాలంలో రైతు వేదికల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: చినజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం కేసీఆర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details