Congress Public Meeting in Jadcherla : రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 800 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్సింగ్ సుఖ్ హాజరయ్యారు. తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా కిీలక నేతలు పాల్గొన్నారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ఎవరు అడ్డకున్నారు? :పాలమూరును అభివృద్ధి చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కానీ తెలంగాణ వచ్చినా పాలమూరులో వలసలు ఆగలేదని ఆరోపించారు. నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదని విమర్శించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ఎవరు అడ్డకున్నారని ప్రశ్నించారు. ఇక్కడ 10లక్షల ఎకరాలు ఎడారిగా మారిపోతున్నాయని అన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే పాలమూరు అభివృద్ధి జరిగిందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయంపై చర్చకు తాను సిద్ధమని అన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే పాలమూరు-రంగారెడ్డి, నారాయణపేట ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత తమదని పేర్కొన్నారు. అలాగే ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు ఇస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని వివరించారు. మరోవైపు 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు భరిస్తామని.. రూ.500లకే గ్యాస్ ఇస్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.