పాలమూరు వేదికగా నేడు కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్(Congress Jung Siren in Mahabubnagar) మోగించనుంది. ఉద్యోగ నియామకాలు,నిరుద్యోగ భృతి, బోధన బకాయిల చెల్లింపు సమస్యలపై....మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభ విజయవంతమయ్యేలా జిల్లా నేతలు భారీసంఖ్యలో జనసమీకరణ చేస్తున్నారు.
అమిస్తాపూర్‌లో సభ..
విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జంగ్ సైరన్(Congress Jung Siren in Mahabubnagar)కు నేడు పాలమూరు వేదిక కానుంది. భూత్పూరు మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లో భారీ బహిరంగ సభకు హస్తం పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. సాయంత్రం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 7గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభకు హాజరుకానున్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆయన మహబూబ్‌నగర్ జిల్లాకు రానుండటంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజక వర్గాల నుంచి భారీఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. ఇప్పటికే అన్నినియోజక వర్గాల్లో మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటుచేసి విద్యార్ధులు, నిరుద్యోగులు సహా పార్టీ కార్యకర్తలను తరలించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. సుమారు 2లక్షల మందిని సభలో భాగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.