ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల డిమాండ్‌తో మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ (Congress Jung Siren) నిర్వహించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Pcc Chief Revanth Reddy) సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు సభలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువతకు కేసీఆర్ (Cm Kcr) అన్యాయం చేశారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేవరకు, విద్యార్థుల బోధనా రుసుంలు విడుదలయ్యే వరకు ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
అవకాశం ఇవ్వండి...
తెలంగాణ పునర్ నిర్మాణం పాలమూరు నుంచే మొదలుపెడతామని చెప్పిన కేసీఆర్... మాట తప్పారని మండిపడ్డారు. ఉద్యమ పార్టీగా తెరాస ఆవిర్భావించిన నాటి నుంచి నేడు అధికార పార్టీ వరకు పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్... అన్యాయం చేశారని విమర్శించారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని పంచుకున్న తెరాస... పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించుకుపోతుంటే చూస్తూ ఊరుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడం ద్వారా తెలంగాణ రూపురేఖలు మార్చేందుకు అవకాశం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రజలను కోరారు.
సర్కార్‌కు హెచ్చరిక...
పాలమూరు గడ్డ మీద జంగ్ సైరన్ సభ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Clp Leader Bhatti Vikramarka) అన్నారు. ఉద్యోగాలు, విద్య, నదీజలాలు ఇతర వనరుల కోసం ప్రత్యేక తెలంగాణ తెచుకున్నామని... కానీ ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నీళ్లకోసం తెలంగాణ తెచ్చుకుంటే కృష్ణా నది మీద కట్టాల్సిన ఒక్క ప్రాజెక్టు కేసీఆర్ కట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా లాంటి అనేక ప్రాజెక్టులు కట్టినట్లు గుర్తుచేశారు. పక్క రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఏడాది కాలంగా కేసీఆర్ నిద్ర పోతున్నాడని దుయ్యబట్టారు. కృష్ణా జలాలు తెలంగాణకు లేకుండా చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు, మల్లురవి, గీతారెడ్డి, మధుయాష్కీ తదితర నాయకులు పాల్గొన్నారు,