Congress Public Meeting in Jadcherla : దేశ ఐక్యత కోసం కాంగ్రెస్ పాటుపడటం వల్లే.. భారత్ తన కాళ్లపై తాను నిలబడగలిగిందని హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశం కోసం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ప్రధానుల ప్రాణాలు పణంగా పెట్టిన చరిత్ర.. కాంగ్రెస్‌దని సుఖ్వీందర్ సింగ్ సుఖు గుర్తు చేశారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చినా.. సోనియాగాంధీ త్యాగం చేశారని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు అవకాశమిస్తే అభివృద్ధి, మార్పు ఎలా ఉంటుందో చూపుతామన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా అని ఆయన ప్రశ్నించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తున్నామని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక్కడా అమలు చేస్తామన్నారు.
''తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. మేం గద్దెనెక్కగానే హిమాచల్ ప్రదేశ్‌లో పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాం. అదే తరహాలో తెలంగాణలోనూ ఓపీఎస్ విధానం అమల్లోకి తెస్తాం. సామాజిక, మానవీయ కోణంలోనే ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలను కాంగ్రెస్ తీసుకుంటుంది. అధికార యావతో కాకుండా.. వ్యవస్థలో మార్పు తెచ్చేందుకే పాటుపడతాం.'' -సుఖ్వీందర్‌సింగ్ సుఖు, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి
జనం ఇక గులాబీ బాస్‌ను నమ్మరు.. : రాష్ట్రంలోని అడవి బిడ్డలను మోసగించేందుకు.. సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. జనానికి ఉచిత సిలిండర్లు ఇచ్చినా.. జనం గులాబీ బాస్‌ను నమ్మరని ఎద్దేవా చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడం ద్వారా పది లక్షల ఎకరాలను ఎడారి చేసే హక్కు కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఖాళీగా ఉన్న 2 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.