తెలంగాణ

telangana

ETV Bharat / state

పచ్చదనానికి గురువులు.. సీఎం ప్రశంసలు - telangana latest news

ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా బోధనకే పరిమితం కాకుండా.... మొక్కలు నాటడం లాంటి సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్న అధ్యాపకుడు, ప్రధానోపాధ్యాయుడ్ని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో ఇద్దరు గురువుల ప్రస్తావనను సీఎం గుర్తుచేశారు. విద్యాబోధనకే కాకుండా... సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించాలని సీఎం సూచించారు.

cm kcr prizes two professors on his social activeness
పచ్చదనానికి గురువులు.. సీఎం ప్రశంసలు

By

Published : Jul 17, 2020, 5:05 AM IST

Updated : Jul 17, 2020, 6:00 AM IST

సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సహాయ ఆచార్యుడు, ప్రధానోపాధ్యాయుడిపై సీఎం కేసీఆర్‌ ప్రశంసలు కురిపించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సదాశివయ్య.... పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పీర్ మహ్మద్ షేక్ గురించి అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరు తమ విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారని వివరించారు.

సీఎం ఫోన్​..

జడ్చర్ల డిగ్రీ కళాశాలలో పెద్దఎత్తున మొక్కలు నాటడంతో పాటు.... బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న సదాశివయ్యతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. సదాశివయ్య కృషిని టీవీల్లో స్వయంగా చూశానని సీఎం పేర్కొన్నారు. జడ్చర్లలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు ప్రయత్నాన్ని కొనసాగించాలని.... దానికి కావాల్సిన నిధులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. పాలమూరు విశ్వవిద్యాలయంలోనూ పెద్ద ఎత్తున మొక్కలు పెంచాలని సూచించారు. ప్రతిపాదనలతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ను కలిస్తే నిధులు మంజూరు చేస్తారని ఫోన్లో వివరించారు.

ప్రకృతి కోసం రూపాయి నినాదంతో..

సహాయ ఆచార్యడు సదాశివయ్య జడ్చర్ల కళాశాలలో ముప్పావు ఎకరంలో గార్డెన్‌ ఏర్పాటు చేశారు. సహ ఆచార్యుల సహకారంతో... పది నెలల్లోనే హరితవనంగా తీర్చిదిద్దారు. ప్రకృతి కోసం రూపాయి నినాదం పేరుతో.... చందాదారుల పేరు మీద మెుక్కలు నాటి వాటిని కాపాడుతున్నారు. ఈ తోటలో 300 రకాలకు చెందిన 800 మెుక్కలు ఉన్నాయి. ఈ ఉద్యానం అభివృద్ధిలో కళాశాల ఆవరణలో మరో నాలుగు ఎకరాల్లో తెలంగాణ బొటానికల్‌ గార్డెన్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆరు నెలల్లో మెుక్కలతో రాష్ట్రం ఆకారం దర్శనమిచ్చే విధంగా కృషి చేస్తామని సదాశివయ్య తెలిపారు.

జీవ వైవిధ్యం ఉట్టిపడేలా..

నాలుగేళ్లు కిందటి వరకు రాళ్లు రప్పలతో ఉన్న పత్తిపాక ఉన్నత పాఠశాలను ఆహ్లాదానికి చిరునామాగా మార్చారు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పీర్‌ మహ్మద్ షేక్‌. మూడేళ్ల క్రితం పాఠశాలకు బదిలీపై వచ్చిన ఆయన.... బడి రూపురేఖలు మార్చివేశారు. పూలు, పండ్ల జాతి మెుక్కలు, ఆకు కూరలు, కూరగాయలు సాగుచేశారు. వృక్షశాస్త్రంలో పీహెచ్​డీ పూర్తిచేసిన.. పీర్ మహ్మద్‌ జీవ వైవిధ్యం ఉట్టిపడేలా పాఠశాలను తీర్చిదిద్దారు.

విద్యాసంస్థల్లో బోధనతో సామాజిక కార్యక్రమాలను చేపట్టేవారిని ప్రోత్సహించాలని... ప్రభుత్వం తరఫున అవార్డులు ఇవ్వాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అలాంటి వారే సమాజానికి కావాలని వ్యాఖ్యానించారు. విద్యాసంస్థల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.

ఇవీచూడండి:అధ్యాపకుడితో ఫోన్​లో మాట్లాడిన సీఎం కేసీఆర్​

Last Updated : Jul 17, 2020, 6:00 AM IST

ABOUT THE AUTHOR

...view details