సమైక్యపాలనలో వలసలు, ఆకలి చావులకు నిలయమైన పాలమూరు జిల్లా.. స్వయం పాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. హరితహారం స్ఫూర్తితో, గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రికార్డుస్థాయిలో విత్తనబంతులు తయారు చేసి వెదజల్లడం, సీడ్‌బాల్స్‌తో అత్యంత పొడవైన వాక్యం నిర్మించడం ద్వారా పాలమూరు జిల్లా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. ఈ సందర్భంగా జ్ఞాపికను ఎంపీ సంతోష్‌కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు.. ప్రగతిభవన్‌లో కేసీఆర్ అందించారు.
మహిళా సంఘాలకు సీఎం ప్రశంసలు
తక్కువఖర్చుతో ఎక్కువ పచ్చదనం సాధించేలా రికార్డు స్థాయిలో... 2 కోట్ల 10 లక్షల సీడ్‌బాల్స్‌ను మహిళాసంఘాలతో తయారు చేయించారు. వాటిని కొండలు, గుట్టల ప్రాంతాల్లో వెదజల్లారు. ఈ మేరకు పచ్చదనం కోసం పాటుపడుతున్న పాలమూరు జిల్లా మహిళా సంఘాల కృషిని సీఎం అభినందించారు.
ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సాగునీటితో ఎటుచూసినా పచ్చని పంటలతో.. పాలమూరు జిల్లా కనువిందు చేస్తోందని కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు బీడుభూములు, రాళ్లు, గుట్టలకే పరిమితమైన పాలమూరు జిల్లా ప్రస్తుతం రూపురేఖలు మార్చుకొని పచ్చదనంతో, వినూత్న రీతిలో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుండటం సంతోషకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:అసంపూర్తిగా హుజూరాబాద్- పరకాల రహదారి.. ఐదేళ్లయినా కదలని పనులు