మహబూబ్నగర్ జిల్లాలోని జిల్లా పరిషత్ మైదానంలో ఏర్పాటు చేసిన దసరా వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎదుట ఓ వ్యక్తిపై బీఆర్ఎస్ నేతలుదాడి చేశారు. అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, వారిని అడ్డుకోకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
జిల్లా పరిషత్ మైదానంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో చివరగా బాణసంచా కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రసంగిస్తుండగానే బాణసంచా కాల్చడం మొదలుపెట్టారు. దీంతో మంత్రి దసరా ఉత్సవ కమిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ నిర్వహకులు బాణసంచా నిర్వాహకుడిని హెచ్చరిస్తూ వేదికపైకి రావాలని తెలిపారు. దీంతో బాణసంచా నిర్వాహకుడు హరనాథ్ వేదికపైకి రాగానే బీఆర్ఎస్ నాయకులు అతనిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు ఈ దాడి గురించి పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది. వెంటనే కొందరు పోలీసులు బీఆర్ఎస్ నేతలకు సర్దిచెప్పి హరనాథ్ను పక్కకు తప్పించడంతో గొడవ సద్దుమణిగింది.