Bandi Sanjay On CM KCR ఎన్ని కూటములు కట్టినా కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. అవినీతిపై విచారణ జరుగుతుందనే భయంతోనే వామపక్షాలు, ఎంఐఎం లాంటి పార్టీల నేతలను కలుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌తోనూ పరోక్షంగా దోస్తీ కడుతున్నారని బండి ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన నిరసన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జీవో 317కు వ్యతిరేకంగా మహబూబ్‌నగర్‌లో బండి సంజయ్ నిరసన దీక్ష చేశారు.
హైదరాబాద్‌లో భారీ సభ
Bandi on employees GO: ఉద్యోగుల పాలిట శాపంగా మారిన జీవో సవరించే వరకూ తమ పోరు ఆగదని ఆయన స్పష్టం చేశారు. తెరాస హయాంలోని ప్రాజెక్టులతో ఎన్ని ఎకరాలకు అదనంగా నీరు అందించారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కొవిడ్ కంటే పెద్ద వైరస్ రాష్ట్రానికి కేసీఆర్‌యేనన్న బండి సంజయ్.. కరోనా తర్వాత హైదరాబాద్‌లో భారీ బహిరంగ ఏర్పాటు చేసి తమ సత్తా చాటుతామని తెలిపారు. కేసీఆర్ ఆధికారంలో ఉండేది రెండేళ్లేనన్న సంజయ్.. తాము అధికారంలోకి రాగానే 317 జీవోను సవరించి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నప్పుడు ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి. అందుకే అప్పుడు సీపీఎం వాళ్లను పిలిచిండట. అవినీతిపై విచారణ జరుగుతుందనే మళ్లీ థర్డ్ ఫ్రంట్ తెరపైకి తెచ్చారు. ఇవాళ ఎంఐఎం, సీపీఎం, కాంగ్రెస్‌తో పరోక్షంగా, ప్రత్యక్షంగా దోస్తానా చేస్తున్నరు. కేసీఆర్ నల్లులకే నడక నేర్పిండట. దా బిడ్డ మళ్లీ కృష్ణమ్మకు నడక నేర్పతారా? ఆ విధంగానైనా పాలమూరు జిల్లా కన్నా నీళ్లు వస్తాయి. 575 టీఎంసీలు నీళ్లు రావాల్సిన ప్రాంతానికి కేవలం 299 టీఎంసీలకే సంతకం పెట్టి వేల కోట్లు రూపాయలు దోచేశారు. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
పోరాటం కొనసాగించాలని మోదీ చెప్పారు
bandi sanjay deeksha: కేసీఆర్ గద్దె దిగే దాకా ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ప్రధాని తనకు ఫోన్ చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు భరోసా ఇవ్వాల్సిందిగా చెప్పారని తెలిపారు. తెరాసపై పోరాటం కొనసాగించాల్సిందిగా మోదీ చెప్పారని వివరించారు. కేసీఆర్ తీరుతో ఉద్యోగులు సొంత ప్రాంతాలను వదిలి ఇతర జిల్లాలకు వలస వెళ్లాల్సివస్తోందని పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఏమైంది?
భార్య, భర్త, పిల్లలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సిన దుస్థితి దాపురించిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. జైలుకెళ్లడం తనకు కొత్తకాదన్న సంజయ్.. అన్నివర్గాల ప్రజల పక్షాన తెరాసకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఏకైక పార్టీ భాజపా మాత్రమేనని గుర్తు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ఏమైందని ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించారు. విద్యా వాలంటీర్లు, క్షేత్ర సహాయకులకు భాజపా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భాజపా అధికారంలోకి వచ్చాక తిరిగి వారిని విధుల్లోకి తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. పాలమూరులో భవానీ దేవాలయ స్థలాన్ని కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.
కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం: ఈటల రాజేందర్
రాష్ట్రంలో నిర్వహిస్తున్న రైతుబంధు ఉత్సవాల్లో తెరాస వెంట రైతులు సహా ఏవర్గం ప్రజలూ లేదని భాజపానేత, హూజూరాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. అన్నివర్గాలూ తెరాసకు దూరమయ్యాయని, పార్టీలు, జెండాలకు అతీతంగా కేసీఆర్‌ను గద్దె దించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ సమస్యల నిరసన సభకు ఆయన హాజరయ్యారు.
ధరణితో లక్షల ఎకరాలు మాయం
ధరణి పేరిట రాష్ట్రంలో లక్షల ఎకరాల భూములు మాయమయ్యాయని ఆరోపించారు. లక్షల ఎకరాల్లో భూములకు సాగునీళ్లిచ్చామన్న కేసీఆర్ అలాంటి భూముల్లో ఎలాంటి పంటలు పడుతాయో తెలియదా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో డబ్బు కేంద్రానిదైతే కేసీఆర్ ఫోటోలు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఉప్పుడు బియ్యం కొనమంటే నానా రాద్ధాంతం చేశారని దుయ్యబట్టారు. ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేని, అందుకు కారకులు రాష్ట్ర ముఖ్యమంత్రేనని ఆరోపించారు. 317 జీవోను సవరించాలన్న అంశాన్ని మంత్రివర్గం, ముఖ్యమంత్రి విస్మరించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను అధికారంలోకి వచ్చాక సీఎం మరచిపోయారన్నారు. ఉద్యోగులు తమ సమస్యలపై ఎవరికైనా విజ్ఞప్తులు చేస్తే ప్రతికార చర్యలకు దిగుతున్నారన్నారు. సరైన సమయంలో జనం కర్రుకాల్చి వాత పెడతారని ఈటల హెచ్చరించారు. సమస్యలపై శాంతియుతంగా నిరసనలకు దిగితే అణచివేతకు గురి చేస్తున్నారన్నారు. హుజూరాబాద్‌లో జరిగిన విధంగానే కేసీఆర్ చెంప చెల్లుమనిపించేందుకు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని, భాజపా ఆ లక్ష్యాన్ని నెరవేర్చనుందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రాజెక్టుల పేరుతో వేలకోట్ల దోపిడీ: డీకే అరుణ
పాలమూరు జిల్లా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్, ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాకు చేసిందేమీ లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. నదులకు నడక నేర్పాడంటున్న కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పట్టించిన గతి ఏమిటని ఆమె ఎదురుదాడికి దిగారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భాజపా అధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ, ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలపై నిరసన సభలో ఆమె మాట్లాడారు. కేసీయార్ నదులకు నడక నేర్పలేదని రాష్ట్రంలో అవినీతి ఎలా చేయాలో, దోపిడి ఎలా చేయాలో మంత్రులు, శాసనసభ్యులకు నేర్పారని దుయ్యబట్టారు. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరిట వేలకోట్ల ప్రజాధనం దోపిడికి గురైందని ఆరోపించారు. పాలమూరు మంత్రి జిల్లాకు చేసిందేమి లేదని, జాతీయ రహదారులు, వైద్యకళాశాల గత ప్రభుత్వాలు చేపట్టినవేనన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఇసుక, మట్టి, భూ మాఫియా చెలరేగి పోతోందని విమర్శించారు. 9 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నా ముఖ్యమంత్రిలో చలనం లేదని, జీవో సవరించే వరకూ భాజపా పోరాటం కొనసాగుతుందని డీకే అరుణ స్పష్టం చేశారు.
కేంద్రం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి పనులు: మురళీధర్ రావు
దేశంలో భాజపా కార్యకర్తలను జైల్లో పెట్టిన వాళ్లు జైలుపాలు కావాల్సిందేనని ఆ పార్టీ జాతీయ నాయకులు మురళీధర్ రావు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఉపాధ్యాయ, ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలపై భాజపా అధ్వర్యంలో జరిగిన నిరసన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాంతీయ పార్టీగా తెరాస దేశ వ్యతిరేకతను ప్రోత్సహింస్తోందని ఆరోపించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి చెల్లిస్తున్న డబ్బుల్ని ఇతర రాష్ట్రాలకు ఖర్చుపెడుతున్నారని తెరాస నేతలు ఆరోపిస్తున్నారని, దేశరక్షణకు, వాక్సినేషన్ లాంటి కార్యక్రమాలకు డబ్బులు ఎవరిస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రెవిన్యూ మోదీ జేబులోకి వెళ్లదని, దేశం కోసం ఖర్చు చేస్తారని గుర్తు చేశారు. కేటీఆర్ భాజపా అధ్యక్షునికి రాసిన లేఖపై ఆయన స్పందించారు. బూతులు మాట్లాడే నాయకులు, కుటుంబం ఉన్న పార్టీ తెరాసేనని ఎదురుదాడికి దిగారు. తెరాసతో ఒప్పందం చేసుకున్న చరిత్ర భాజపాకు లేదని, తెరాసకు వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసున్న ఏకైక పార్టీ తెలంగాణలో భాజపా మాత్రమేనన్నారు. దోని చప్పుడే తప్ప, దొయ్య పారలేదన్నట్లుగా తెరాస ప్రచారమే తప్ప క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరగడం లేదన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తెలంగాణలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని మురళీధర్ రావు స్పష్టం చేశారు.