JP NADDA IN TS: తెలంగాణలో భాజపాకి మంచి అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. కేసీఆర్ సర్కార్ అవినీతిపై నాయకులంతా నిలదీయాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన భాజపా పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి పార్టీ విస్తరణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేపీ నడ్డా సూచించారు. దళిత బస్తీలకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని వివరించారు.
నెలరోజుల ప్రణాళిక అవసరం:యువమోర్చా, యువజన సంఘాలు, స్పోర్ట్స్ పర్సన్స్‌తో మాట్లాడాలని తెలిపారు. మహిళా మోర్చా స్వయం సహాయక బృందాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను అని కాకుండా.. పార్టీ నాకు పనిచేసే అవకాశం ఇచ్చిందని ఫీల్ కావాలని నేతలకు వివరించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా జిల్లా పర్యటనలు చేయకండని నడ్డా సూచించారు. ఏం మాట్లాడాలో ముందే సన్నద్ధం కావాలని.. కేసీఆర్ సర్కార్ అవినీతి, కేంద్ర ప్రభుత్వ పథకాలపై మాట్లాడాలంటే నెల రోజుల ముందే నిర్ణయించుకోవాలని తెలిపారు.