ఎన్నికలే అజెండాగా.. పాలమూరు వేదికగా బీజేపీ సమావేశాలు BJP Leaders Meeting in Mahabubnagar: అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సంసిద్ధమవ్వడమే ప్రధాన అజెండాగా రెండు రోజుల పాటు మహబూబ్‌నగర్ జిల్లా అప్పనపల్లిలోని బీజేపీ రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా ఇందులో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. ఎలాంటి వ్యూహాన్ని సిద్ధం చేయాలనే అంశంపైనా సమాలోచనలు చేయనున్నారు.
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై చర్చ:బండి సంజయ్ అధ్యక్షతన జరిగే సమావేశాలకు పార్టీ జాతీయ నేతలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన.. పోలింగ్ బూత్ సమ్మేళనాలు, పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనా చర్చించనున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించిన అంశాలను.. ఈ నెల 28, 30, 31 తేదీల్లో నిర్వహించనున్న.. జిల్లా కార్యవర్గ సమావేశాల్లో వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
వివిధ అంశాలే అజెండాగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు: ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు మండల కార్యవర్గ సమావేశాల్లోనూ నేతలకు పలు అంశాలపై మార్గనిర్దేశనం చేయనున్నారు. ఈ నెల 29న నిర్వహించనున్న ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ నిర్వహణను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంపైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది. స్వశక్తి మండల్, సక్రియ పోలింగ్ బూత్, పన్నా ప్రముఖ్ కార్యకలాపాలతో పాటు భవిష్యత్ కార్యక్రమాల యోజన, పరీక్ష పే చర్చ వంటి అంశాలే అజెండాగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కొనసాగనున్నాయి. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు దాదాపు 250 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటికే జిల్లా నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
"దిల్లీలో జరిగిన ప్రకియను బూత్లెవల్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా పార్టీ వ్యవస్థ, బలోపేతంపై చర్చిస్తాం. రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడతాం. వివిధ అంశాలే అజెండాగా సమావేశాలు సాగనున్నాయి." -జితేందర్‌రెడ్డి, బీజేపీ నేత
ఇవీ చదవండి: