కరోనా కట్టడి, పోతిరెడ్డిపాడుపై 203 జీవోను అడ్డుకోవడంలో రాష్ట్రప్రభుత్వం దారుణంగా విఫలమైందని భాజపా నేత, మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా నిర్ధరణ పరీక్షలు వేలల్లో చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం రోజూ 500 పరీక్షలకే పరిమితమవుతున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జూమ్ యాప్ ద్వారా మహబూబ్‌నగర్ నుంచి మీడియాతో మాట్లాడారు. 25 ఆసుపత్రుల్లో పరీక్షలు చేయడానికి అవకాశం ఉన్నా.. రోజూ 15వేల పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నా.. కేవలం 500 మాత్రమే చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా.. కరోనా కట్టడిపై తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదన్నారు. ఐసీఎంఆర్ నిబంధనలు అన్ని రాష్ట్రాలకు ఒక్కటేనన్న ఆమె.. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు చేస్తుంటే... తెలంగాణలో ఎందుకు చేయడం లేదన్నారు. ఇక పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన 203 జీవోను రద్దు చేయించాల్సిన బాధ్యత కేసీఆర్‌దేనని ఆమె అన్నారు. లేఖ రాసి చేతులు దులుపుకుంటే సరిపోదని అభిప్రాయపడ్డారు.
'203 జీవోను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది'
కరోనా కట్టడితో పాటు పోతిరెడ్డిపాడుపై 203 జీవోను అడ్డుకోవడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. జగన్, కేసీఆర్ పరస్పర అవగాహనతోనే 203 జీవో వచ్చిందని ఆమె ఆరోపించారు. పోతిరెడ్డిపాడు విషయంలో ఏ జిల్లాకు అన్యాయం జరిగినా ఊరుకోబోమని.. పోరాటం చేస్తామని డీకే అరుణ తెలిపారు. కరోనా పరీక్షలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆమె మండిపడ్డారు.
జగన్, కేసీఆర్ మధ్య పరస్పర అవగాహనతోనే 203 జీవో వచ్చిందని ఆమె ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేసీఆర్‌కు ఆసక్తి లేదని.. ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. పోతిరెడ్డి పాడు విషయంలో పాలమూరు జిల్లా సహా ఇతర ఏ జిల్లాకు అన్యాయం జరిగినా భాజపా చూస్తూ ఊరుకోదని.. ఈ విషయంలో పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉద్యోగులకు జీతాల్లో కోతల ద్వారా, ప్రజలపై కరెంటు బిల్లుల ద్వారా ప్రభుత్వ భారం మోపుతోందన్నారు. అసలే ఆర్ధిక సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి... భారం మోపడం సరికాదన్నారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని, వచ్చినా భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు కూడా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ తప్పుడు ప్రచారం: ఉత్తమ్