BJP Future Activity Is Aimed Strengthening Power In Telangana: భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ.. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే దిశగా.. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు గార్డెన్ వేదికగా మొదటి రోజు.. బండి సంజయ్ అధ్యక్షతన పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. కార్యవర్గ సమావేశంలో చర్చించే అంశాలు, ముసాయిదా తీర్మానాలపై చర్చించారు.
బండి సంజయ్ పదాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున.. పెద్దఎత్తున ఉద్యమించేలా కార్యక్రమాలు రూపొందించాలని కోరారు. కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదన్న కేసీఆర్ దుష్ప్రచారాన్ని ఎండగట్టాలని కోరారు. పాదయాత్ర ద్వారా.. ప్రజల దృష్టిని బీజేపీ ఆకర్షించిందని.. ఇకపై స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. మోదీ ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
రాబోయే 3 నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణపైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరిలో 15 రోజులపాటు.. 9వేల శక్తి కేంద్రాల పరిధిలో కనీసంగా 200 మందితో వీధికూడలి సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ కుటుంబ- అవినీతి- నియంత పాలన, ప్రజలు కష్టాలను ఆ సమావేశాల ద్వారా.. ప్రజలకు వివరించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని గుర్తించి, మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా వీధికూడలి సమావేశాలు జరగనున్నాయి.
BJP Officials Meeting In Mahbubnagar: ఈ మేరకు రాష్ట్ర, అసెంబ్లీ స్థాయిలో సమస్యలను గుర్తించి కరపత్రాలు రూపొందించనున్నారు. ఒక్కొక్కరు 15 సమావేశాల చొప్పున 600మంది వక్తలను, 119 నియోజకవర్గాల్లో సామాజిక మాధ్యమాల ఇంఛార్జ్‌లను గుర్తించి కార్యశాల ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 28, 30, 31 తేదీల్లో అన్ని జిల్లాల కార్యవర్గ సమావేశాలు, ఫిబ్రవరి 5వ తేదీలోపు మండల కార్యవర్గ సమావేశాలను.. పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నారు.