మహబూబ్‌నగర్ జిల్లాలో భారత్ బంద్ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 9 డిపోల్లో ఉన్న 820 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజాము నుంచే మహబూబ్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్ ముందు సీపీఐ, సీపీఎంతో పాటు కాంగ్రెస్, తెరాస శ్రేణులు బైఠాయించారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో ముందు తెరాస శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, మాజీ ఎంపీ మల్లురవి పాల్గొన్నారు.
వనపర్తి ఆర్టీసీ డిపో ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో మాజీ మంత్రి చిన్నారెడ్డి పాల్గొన్నారు. కల్వకుర్తి బస్టాండ్ ముందు చేపట్టిన ఆందోళనలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ధర్నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించటంతో తెరాస శ్రేణులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బంద్‌లో పాల్గొంటున్నారు.